రెండో విడత పోలింగ్‌ 63 శాతం

త్రిపురలో మళ్లీ రిగ్గింగ్‌
అత్యధిక శాతం పోలింగ్‌ అక్కడే
యుపిలో అత్యల్పం
నాలుగు గ్రామాల్లో ఎన్నికలను బహిష్కరించిన జనం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గురువారం రెండో విడత పోలింగ్‌ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. కడపటి వార్తలందేసరికి 61శాతం ఓట్లు పోలయ్యాయి. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాల్లో పోలింగ్‌ నిర్వహించారు. త్రిపురలో మొదటి విడతలో మాదిరిగానే భారీగా రిగ్గింగ్‌ చోటు చేసుకుంది. అక్కడ గరిష్టంగా 77.53 శాతం పోలింగ్‌ నమోదవగా, కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కనిష్టంగా 52.74 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. అస్సాంలో 70.66 శాతం, బీహార్‌లో 53.05 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 72.13 శాతం, జమ్మూకాశ్మీర్‌లో 67.22 శాతం, కర్ణాటకలో 63.90 శాతం, కేరళలో 63.97 శాతం, మధ్యప్రదేశ్‌లో 54.42 శాతం, మహారాష్ట్రలో 53.71, మణిపూర్‌లో 76.06 శాతం, పశ్చిమబెంగాల్‌లో 71.84 శాతం పోలింగ్‌ నమోదైంది. తుది వివరాలు వస్తే ఈ పోలింగ్‌ శాతాలు పెరగవచ్చని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగియాల్సి వుంది. అయితే, అప్పటికే క్యూలో ఉన్న వారికి కూడా ఓటు వేసే వీలు ఎన్నికల కమిషన్‌ కల్పించింది. మూడో విడత పోలింగ్‌ మే 7న జరగనుంది. చివరి విడత జూన్‌ 1న జరుగనుండగా, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. .
కేరళ, పశ్చిమ బెంగాల్‌ల్లో కొన్ని బూత్‌ల్లో ఇవిఎంలతో సమస్యలు, బోగస్‌ ఓటింగ్‌లు జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. ఉత్తరప్రదేశ్‌లోని మథుర, రాజస్థాన్‌లోని బాన్స్‌వారా(ప్రధాని మోడీ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించింది ఇక్కడే) మహారాష్ట్రలోని పర్బని ప్రాంతాలకు చెందిన నాలుగు గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. త్రిపురలోని బ్రూ ఓటర్లు మొదటిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండో రౌండ్‌లో 102మంది మహిళలతో సహా 1202 మంది అభ్యర్ధులు బరిలో వున్నారు. రాహుల్‌ గాంధీ, కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌, హేమమాలిని, శశి థరూర్‌, అరుణ్‌ గోయెల్‌ వంటి హేమాహేమీలు ఈసారి పోటీలో వున్నారు. మధ్యప్రదేశ్‌లోని బీటుల్‌ నియోజకవర్గంలో గురువారమే ఓటింగ్‌ జరగాల్సి వుంది. అయితే అక్కడ బిఎస్‌పి అభ్యర్ధి అశోక్‌ బలావి మరణించడంతో మే 7న మూడో దశలో పోలింగ్‌ జరుగుతుంది.
ఓటర్లకు గిఫ్ట్‌ కూపన్లు
ఈసారి ఎన్నికల్లో పారదర్శకతకు హామీ కల్పించేలా ఇసి చర్యలు తీసుకోలేదని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి విమర్శించారు. బెంగళూరు రూరల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి ఓటర్లకు క్యూఆర్‌ కోడ్‌లతో గిఫ్ట్‌ కూపన్లు పంచారని విమర్శించారు.
ఓటు హక్కు వినియోగించుకున్న 105ఏళ్ళ వృద్ధురాలు
రాజస్థాన్‌లోని మౌంట్‌ అబూలో 105ఏళ్ళ వృద్ధురాలు టిపూ దేవి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఒరిస్సాలో నామినేషన్ల పర్వం ప్రారంభం
మే 20న ఒరిస్సాలో జరగనున్న ఐదు లోక్‌సభ సీట్లకు, 35 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ మే 3 కాగా, 4న పరిశీలన జరుగుతుంది. 6వ తేదీలోగా నామినేషన్లు ఉపసంహరించుకోవాల్సి వుంటుంది. ఇప్పటివరకు నాలుగు లోక్‌సభా స్థానాలకు 39 నామినేషన్లు దాఖలయ్యాయి. 28 అసెంబ్లీ స్థానాలకు 266 మంది నామినేషన్లు వేశారు.
పార్లమెంట్‌కు తొలిసారిగా ఓటు వేసిన బ్రూ ఓటర్లు
పార్లమెంట్‌ ఎన్నికల్లో తొలిసారిగా త్రిపురలోని బ్రూ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతేడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటు వేశారు. 2020 వరకు ఉత్తర త్రిపుర జిల్లాలోని ఆరు సహాయ శిబిరాల్లో నివసించిన బ్రూ శరణార్ధులకు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో శాశ్వత నివాసం కల్పించబడింది.
సూరత్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిపై వేటు
సూరత్‌ లోక్‌సభా స్థానంలో పోటీకి నిలబెట్టిన కాంగ్రెస్‌ అభ్యర్ధి నీలేష్‌ కుంభానిని గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ నుండి సస్పెండ్‌ చేసింది. ఆరేళ్ళ పాటు ఈ నిషేధం అమల్లో వుంటుంది. ఆయన నామినేషన్‌ పత్రాలపై తాము సంతకాలు చేయలేదంటూ ముగ్గురు ప్రతిపాదకులు తిరస్కరించడంతో ఆయన నామినేషన్‌ తిరస్కరించబడింది.
పేదల జీవితాలు ఎందుకు ఇంకా మారలేదు? : మాయావతి
రైతులతో సహా సమాజంలో అణచివేతకు గురైన వారందరికీ మంచి రోజులు తీసుకువస్తామని బిజెపి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి ప్రశ్నించారు. మీకు మంచి రోజులు వస్తాయంటూ పదే పదే ఊరించారని, కానీ ఆ పేదల జీవితాలు ఎందుకు ఇంకా మారలేదని అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

➡️