Supreme Court : ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి

Apr 19,2024 08:36 #EVM, #Supreme Court, #voters
  • ఎటువంటి అనుమానాలకు తావివ్వొద్దు
  • ఇసికి స్పష్టం చేసిన సుప్రీం
  •  వివిప్యాట్‌ స్లిప్పుల వెరిఫికేషన్‌పై తీర్పు రిజర్వ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా సాగాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరగడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌ (ఇవిఎం)లో పోలైన ఓట్లను 100 శాతం వివిప్యాట్‌ పేపర్‌ స్లిప్స్‌తో క్రాస్‌ వెరిఫికేషన్‌ చేయాలని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఎడిఆర్‌) దాఖలు చేసిన పిటిషన్‌పై వాద ప్రతివాదనలు పూర్తవడంతో న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తలతో కూడిన ధర్మాసనం తీర్పు రిజర్వ్‌లో ఉంచింది. ఎడిఆర్‌ తరపున వాదించిన సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఇటీవల కేరళలో జరిగిన మాక్‌ పోల్‌ను ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ”కాసరగడ్‌లో మాక్‌ ఓటింగ్‌ జరిగింది. అక్కడ నాలుగు ఇవిఎంలను వివిప్యాట్లతో సరిపోలిస్తే బిజెపికి అదనంగా ఓట్లు వచ్చాయి” అని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని పరిశీలిం చా లని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీనిపై ఎన్నికల సంఘం తరపున సీనియర్‌ న్యాయవాది మణిందర్‌ సింగ్‌ స్పందిస్తూ కేరళలోని కాసరగడ్‌లో మాక్‌ పోలింగ్‌లో బిజెపికి ఎక్కువ ఓట్లు పోలైనట్లు వచ్చిన నివేదికలు తప్పు అని, జిల్లా కలెక్టర్‌ నుంచి ఆ వార్తలపై వివరణ తీసుకున్నామని, అవన్నీ తప్పుడు వార్తలని పేర్కొన్నారు. దీనిపై పూర్తి రిపోర్టును కోర్టులో సమర్పించనున్నట్లు సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమీషనర్‌ నితీశ్‌ కుమార్‌ తెలిపారు. ఈవిఎంలను ట్యాంపర్‌ చేయడం అసాధ్యమని అన్నారు. నాలుగు కోట్లు వివిప్యాట్‌ స్లిప్పులు లెక్కించామని, ఎక్కడా మ్యాచ్‌ కాకపోవడమనేది లేదని అన్నారు. ఇవిఎంలను ఏ దశలోనూ కూడా ట్యాంపరింగ్‌ చేయడం అసాధ్యమని ధర్మాసనానికి ఇసి స్పష్టం చేసింది. పోలింగ్‌ ముగిశాక అధికారులు ‘క్లోజ్‌’ బటన్‌ను నొక్కాలని, దీని తరువాత నుంచి ఇవింఎలు ఎలాంటి ఓట్లను అనుమతించవని తెలిపింది. ప్రిసైడింగ్‌ అధికారి పోలింగ్‌ ప్రారంభం, ముగింపు సమయాలను మెషిన్‌లో నమోదు చేస్తారని గుర్తు చేసింది. పోలైన ఓట్లను వివిప్యాట్‌ స్లిప్పులతో వేరిఫికేషన్‌ చేయడం ఇప్పటి వరకు 41,629 సార్లు జరిగిందని, అన్ని సార్లు కూడా స్లిప్‌లు, ఓట్లు సరిపోయాయని తెలిపింది. ఒక పోలింగ్‌ స్టేషన్‌లోని వివిప్యాట్‌లను లెక్కించేందుకు కనీసం గంట సమయం పడుతుందని చెప్పింది.

➡️