బెంగాల్‌ పోలీసుల దాష్టీికాన్ని ఖండించిన సిఐటియు, ఎఐకెఎస్‌

Feb 15,2024 08:49 #CITU, #police, #West Bengal
west bengal police fire on anarul islam

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో మంగళవారం నాడు శాంతియుతంగా ప్రజా ఆందోళనలో పాల్గొంటున్న కామ్రేడ్‌ అనరుల్‌ ఇస్లాంను కాల్చి చంపిన పశ్చిమ బెంగాల్‌ పోలీసుల దారుణ చర్యలను సిఐటియు, ఎఐకెఎస్‌లు తీవ్రంగా ఖండించాయి. ఇస్లాం మృతికి కారకులైన వారిని గుర్తించి, వారిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌, ఎఐకెకెస్‌ అధ్యక్ష కార్యదర్శులు అశోక్‌ ధావలె, విజూ కృష్ణమూర్తిలు వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశారు. ఈ నెల 16న దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్‌నకు ఎస్‌కెఎం-సిటియులు సంయుక్తంగా పిలుపిచ్చాయి. అయితే బెంగాల్‌ హయ్యర్‌ సెకండరీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఆ పోరాటాన్ని బెంగాల్‌లో 13నే నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భాగంగా శాంతియుతంగా పౌర ఉల్లంఘన కార్యాచరణలో పాల్గొంటున్న వ్యవసాయ కార్మికుడు, ఎఐఎడబ్ల్యుయు కార్యకర్త అనరుల్‌ ఇస్లామ్‌ (53)ను పోలీసులు కాల్చి చంపడాన్ని నేతలు ఖండించారు. ఆ అమరవీరునికి అరుణాంజలి ఘటించారు. ఇలాంటి చర్యలతో ప్రజా పోరాటాలు ఆగవని, మరింత ఉధృతంగా ముందుకు సాగుతాయని వారు స్పష్టం చేశారు.

ఎలాంటి కవ్వింపు చర్యలు లేనప్పటికీ ఇంత ఆటవికంగా కాల్చి చంపడంలో తృణమూల్‌ ప్రభుత్వ నిరంకుశాధికారం ప్రదర్శితమవుతోందని అన్నారు. పోలీసుల పాశవిక చర్యలను, బెంగాల్‌ ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని సిఐటియు, ఎఐకెఎస్‌లు తీవ్రంగా ఖండిస్తున్నాయని వారు ఆ ప్రకటనల్లో పేర్కొన్నారు. అనరుల్‌ ఇస్లామ్‌ మరణం వృధా కానివ్వబోమని చెప్పారు. కార్పొరేట్‌ అనుకూల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున, మరింత ఉధృతంగా ఈ ప్రజా పోరాటాలు కొనసాగుతాయని అన్నారు. 16న జరిగే బంద్‌ను మరింతగా జయప్రదం చేసేందుకు కంకణబద్ధులు కావాలని అన్ని వర్గాలకు పిలుపిచ్చారు.

➡️