Jairam Ramesh : టిడిపి, జనసేనలతో బిజెపి ఎందుకు పొత్తు పెట్టుకుంది? : జైరాం రమేష్‌

Mar 11,2024 16:25 #Jairam Ramesh, #tdp -janasena

సూరత్‌ (గుజరాత్‌) : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే గెలుస్తుందనే నమ్మకం ఉంటే.. టిడిపి, జనసేన పార్టీలతో పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో న్యారు యాత్ర’ సోమవారం గుజరాత్‌లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా జైరాం రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షాలు మానస్తత్వాలను అంచనా వేయడంలో నిపుణులు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు, ఎన్టీయే భాగస్వామ్య పక్షాలతో పొత్తు పెట్టుకుని 400 సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉంటే.. టిడిపితో, జనసేన పార్టీలతో ఎందుకు పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు? అంతకుముందు ‘ఇండియా’ను ఎదుర్కోవడానికి తాను సరిపోతానని చెప్పారు. మరి ఇప్పుడెందుకు బిజెడి, టిడిపి, జనసేనలతో పొత్తు పెట్టుకుని మరోసారి ఎన్డీయే అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు.’ అని ఆయన అన్నారు. అలాగే ఈ సందర్భంగా.. ‘మన దేశంలో ఎన్నికలంటే అందాల పోటీలు కావు. అవి పార్టీలకు సంబంధించిన పోరాటాలు మాత్రమే కాదు. సిద్ధాంతాలు, చిహ్నాలు, జెండాల పోరాటాన్ని కూడా సూచిస్తాయి.’ అని జైరాం రమేష్‌ అన్నారు.

➡️