మొదటి దశ పోలింగ్‌లో ఆరు శాతం ఓట్ల తేడా ఎందుకు ?

  • అనవసర జాప్యానికి కారణమేంటి
  • ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఏచూరి లేఖ

ఇండియా న్యూస్‌ నెట్‌వర్కు, న్యూఢిల్లీ : భారత ఎన్నికల కమిషన్‌ ఓటింగ్‌ గణాంకాలను విడుదల చేయడంలో జరుగుతున్న జాప్యాలు, వ్యత్యాసాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు సీతారాం ఏచూరి ఒక లేఖ రాశారు.
అసాధారణమైన రీతిలో ఆలస్యం జరిగిన తర్వాత, మొదటి దశ పోలింగ్‌లో నమోదైన ఓట్ల శాతానికి సంబంధించి తుది గణాంకాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయని, ఇది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, ఇక రెండో దశ పోలింగ్‌లో వివరాలపై ఇప్పటికే నాలుగు రోజుల ఆలస్యం జరిగిందని ఏచూరి ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ అనవసరమైన జాప్యానికి కారణమేంటో వివరిస్తూ ఎన్నికల కమిషన్‌ ఎలాంటి ప్రకటన చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. తొలిగా ప్రకటించిన గణాంకాలకు, తుది అంకెగా ఇసిఐ వెల్లడించిన దానికి మధ్య ఆరు శాతం ఓట్లు పెరిగాయని దీనికి కూడా సమాధానమే లేకుండా పోయిందన్నారు. తొలి, తుది గణాంకాలకు స్వల్పంగా వ్యత్యాసం వుండడం ఆమోదయోగ్యం కానీ ఆరు శాతం ఓట్లు అన్న ఈ తేడా చాలా అసాధారణంగా వుందని, కొంత అనుమానాలకు కూడా తావిస్తోందని ఏచూరి పేర్కొన్నారు. పైగా శాతాల సమాచారం వెల్లడించినప్పటికీ ఓటింగ్‌ గణాంకాలు (పోలైన ఓట్ల సంఖ్య) ను ఇంకా అందించలేదు. ఈ ప్రక్రియకు సంబంధించి పారదర్శకత, విశ్వసనీయత ప్రయోజనాల దృష్ట్యా వీటిపై చెలరేగిన సందేహాలను ఎన్నికల కమిషన్‌ నివృత్తి చేయడం తప్పనిసరని ఏచూరి పేర్కొన్నారు. రాష్ట్రాల వారీగా, నియోజకవర్గాల వారీగా, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా తొలి, తుది ఓట్ల శాతాన్ని, ఆలాగే పోలైన ఓట్ల సంఖ్యను అందచేయాలి. అలాగే, ఏ కేటగిరీలో -ఇవిఎంలు, పోస్టల్‌ బ్యాలెట్లు, విధుల్లో వున్న సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్లలో – ఇంతలా ఓట్ల శాతం పెరిగిందో, ఎలా పెరిగిందో కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం వుందని ఏచూరి ఆ లేఖలో కోరారు.

➡️