అంగన్‌వాడీలపై అమానుషం

Jan 23,2024 08:04 #Anganwadi strike, #Vijayawada
  • అర్ధరాత్రి దీక్షా శిబిరంలో దుశ్శాసన పర్వం
  • లైట్లు ఆపేసి విరుచుకుపడిన మగ పోలీసులు
  •  నిరవధిక దీక్ష చేస్తున్న వారిపైన దారుణ ప్రవర్తన
  • అరెస్ట్‌ చేసి సుదూర ప్రాంతాలకు తరలింపు
  • జిల్లాల నుండి వస్తున్న వారినీ అడ్డగింత
  • అయినా చేరుకున్న వేలాదిమంది
  • బిఆర్‌టిఎస్‌ రోడ్డులో నిరసనలు
  • అరెస్టులునిర్బంధానికి వ్యతిరేకంగా వామపక్షాల నిరాహారదీక్ష

ప్రజాశక్తి-విజయవాడ : అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం అమానుషదాడికి దిగింది. సమస్యలు పరిష్కరించాలని కోరిన పాపానికి వారిపై పైశాచికత్వానికి దిగింది. భయోత్పాతం సృష్టించడమే లక్ష్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అర్ధరాత్రి విరుచుకుపడిండి. నిరవధిక నిరాహార దీక్ష శిబిరంలో నిస్సిగ్గుగా దుశ్శాసన పర్వానికి దిగింది. నాటి తెలుగుదేశం ప్రభుత్వం అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన ఘనతను మూటగట్టుకోగా, నేటి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అర్ధరాత్రిపూట మహిళలపై పోలీసులచేత దాడి చేయించిన ఖ్యాతిని సొంతం చేసుకుంది. ప్రభుత్వం నుండి అందిన ఆదేశాలతో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత మూడు గంటల ప్రాంతంలో వీధిలైట్లు ఆపేసి మరీ దీక్షా శిబిరంలోకి ప్రవేశించిన వందలాది మంది మగ పోలీసులు ఇష్టం వచ్చినట్లు దాడికి దిగారు. కష్టాలు తీర్చాలని కోరుతూ రోజుల తరబడి ఆందోళన చేస్తున్నారని, వారిలో కొందరు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారని, అక్కడున్న వారందరూ మహిళలేనన్న కనీస స్పృహ కూడా లేకుండా కక్షకట్టినట్టు వ్యవహరించారు. అరుపులు, కేకలు, బూతులతో విరుచుకుపడ్డారు. దూర ప్రాంతాల నుండి రావడంతోపాటు, ఉదయం నుండి ఆందోళనల్లో పాల్గొని అలసిపోయి గాఢ నిద్రలో ఉన్న అంగన్‌వాడీలు అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ దాడితో దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోగానే పోలీసులు దీక్షా శిబిరాన్ని కూల్చివేశారు. కుర్చీలు విసిరివేశారు. పడుకుని ఉన్న మహిళలను లాగేసి, వారిని అలాగే ఎత్తుకెళ్ళి బస్సుల్లో పడేశారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా నిరవధిక నిరాహార దీక్షల్లో ఉన్న వారి పట్ల కొంత సున్నితంగా వ్యవహరించే విషయం తెలిసిందే. కానీ, అందుకు భిన్నంగా జగన్‌ ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరించింది. ఐదురోజులుగా దీక్షలతో నీరసించి, నిస్త్రాణంగా ఉన్నవారిని అంబులెన్స్‌లో తరలించడానికి బదులుగా మిగిలిన వారి మాదిరే బస్సుల్లో ఎత్తి పడేశారు. వారు స్పృహ కోల్పోయినా పట్టించుకోలేదు. తోటి అంగన్‌వాడీలు అరచిగోల చేసినా ఖాతరు చేయలేదు. ఈ అమానవీయ ప్రవర్తన కారణంగా నిరవధిక దీక్షలో ఉన్న రామలక్ష్మి ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. ఈ ఘటనలను చిత్రీకరించడానికి ప్రయత్నించిన మీడియా ప్రతినిధుల మీదా పోలీసులు జులుం చేశారు. ఈ అమానుష అరెస్ట్‌ పర్వం ముగిసిన తరువాత దీక్షా శిబిరంలో ఎక్కడ చూసినా పగిలిన గాజులు, చినిగిన చీర ముక్కలు, తెగిన చెప్పుల కుప్పలు కనిపించాయి. వీటి మధ్యనుంచే ఒక పోలీస్‌ అధికారి ‘ఆపరేషన్‌ సక్సెస్‌’ అని పై అధికారులకు చెప్పడం వినిపించింది.

మరోవైపు అంగన్‌వాడీ సంఘాలు ప్రకటించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి కోటి సంతకాలతో జిల్లాల నుండి బయలుదేరిన అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ నిర్బంధాన్ని దాటుకుని వేలాదిమంది విజయవాడకు చేరుకున్నారు. వీరిలో పలువురు దఫాలు, దఫాలుగా బిఆర్‌టిఎస్‌ రోడ్డుకు చేరుకుని నిరసన తెలిపారు. ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గుంపులు, గుంపులుగా అంగన్‌వాడీలు బిఆర్‌టిఎస్‌కు రావడం పోలీసులు అరెస్ట్‌ చేయడం కనిపించింది. బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లోనూ అరెస్ట్‌ల పరంపర కొనసాగింది. దీంతో విజయవాడ ఉద్రిక్తంగా మారింది. అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన అమానుష ధోరణి చర్చనీయాంశమైంది. పలువురు ఈ చర్యను ఖండించారు. నిర్బంధానికి నిరసనగా వామపక్ష నాయకులు సిపిఎం కార్యాలయంలో నిరాహారదీక్ష ప్రారంభించారు.

➡️