అంగన్వాడీల జాయినింగ్‌కు సాంకేతిక సమస్యలు

అమరావతి: గత నెలరోజులుగా చేపట్టిన సమ్మె విరమించి విధుల్లోకి వచ్చిన అంగన్వాడీలకు పాలనాపరమైన సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 80 వేల పైచిలుకు అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి మంత్రి బత్స సత్యనారాయణ ఆ సంఘాల ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో వారంతా మంగళవారం యథావిధిగా విధులకు హాజరుకావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో విధుల్లోకి వచ్చిన అంగన్వాడీల నుంచి జాయినింగ్‌ రిపోర్టు తీసుకుని టెర్మినేషన్‌ ఆర్డర్లు రద్దు చేయాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. తమను నేరుగా విధుల్లో చేరాలని మంత్రుల కమిటీ సూచించిందని.. జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వబోమని అంగన్వాడీలు స్పష్టం చేశారు. దీంతో రిపోర్టు ఇవ్వని వారికి తాళాలు ఇచ్చేందుకు సూపర్‌వైజర్లు విముఖత వ్యక్తం చేశారు. టెర్మినేషన్‌ ఆర్డర్లు రద్దు చేయాలంటే జాయినింగ్‌ రిపోర్టు తప్పనిసరిగా ఇవ్వాలని ఐసీడీఎస్‌ పీడీలు చెప్పడంతో అంగన్వాడీ కేంద్రాల వద్దే వర్కర్లు, హెల్పర్లు నిరీక్షిస్తున్నారు.

➡️