కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేయాలి

Mar 13,2024 23:50 #MLC KS Lakshmana Rao, #Teachers
  • పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేయాలని శాసనమండలి పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ కెఎస్‌ లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు అధ్యాపక సంఘాల నాయకులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డిని బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,200 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్‌ చేయడానికి ప్రభుత్వం చట్టం చేయడంతోపాటు జిఓ కూడా విడుదల చేసిందని తెలిపారు. జూనియర్‌ కళాశాలల్లో 3,600 మంది, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 309 మంది, డిగ్రీ కళాశాలల్లో 670 మంది చొప్పున 4,600 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారని వివరించారు. వీరిలో ఒక్కరిని కూడా ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయలేదని పేర్కొన్నారు. నోటిఫికేషన్లు లేవని, మంజూరు పోస్టుల్లో నియామకాలు జరగలేదని, గ్యాప్‌ పీరియడ్‌లు, రోస్టర్‌ లేదని తదితర కారణాలతో ఆలస్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జవహర్‌రెడ్డితో పాటు పాఠశాల ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌, సాంకేతిక విద్య కమిషనరు నాగరాణి, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావును కూడా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సురేష్‌, శ్రీనివాస్‌, రత్నకుమారి, స్వాతి, రాజు, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️