గిరిజన ప్రాంతాలు కలుపుతూ పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలి

Feb 20,2024 21:35 #Dharna, #polavaram

జిల్లా సాధన ఐక్యకారాచరణ సమితి ఆధ్వర్యాన ఆందోళన

ప్రజాశక్తి – పోలవరం :గిరిజన ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలని పోలవరం జిల్లా సాధన ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యాన ఏలూరు జిల్లా పోలవరం ఏటిగట్టు సెంటర్లో మంగళవారం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. తొలుత విద్యార్థులతో కలిసి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర జీవనాడైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఎంతోమంది గిరిజనులు, మైదాన ప్రాంత ప్రజలు, పోలవరం మండల కేంద్ర ప్రజలు నష్టపోయారన్నారు. వర్తక వాణిజ్య వ్యాపారాలు పూర్తిగా కుంటుపడ్డాయని, అభివృద్ధి, ఉపాధి లేక వలసలు పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. వీటన్నింటినీ అధిగమించాలంటే గిరిజన జిల్లా ఏర్పాటు అత్యవసరమన్నారు. పోలవరం జిల్లా ఏర్పాటు చేసేలా ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌, టిడిపి నియోజకవర్గ కన్వీనర్‌ బరగం శ్రీనివాసులు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కరిబండి నాగరాజు, జనసేన నియోజకవర్గ కన్వీనర్‌ చిర్రి బాలరాజు, వైసిపి మండల కన్వీనర్‌ బుగ్గం మురళీకృష్ణ మాట్లాడారు. జిల్లా సాధన ఐక్య కార్యాచరణ సమితి నేతలు, కాంగ్రెస్‌, సిపిఐ, సిఐటియు నాయకులు, శ్రీ సాయి హైస్కూల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

➡️