చదువులకు ఊతమిచ్చేందుకే నిబంధనలు

  • కల్యాణమస్తు, షాదీ తోఫాల కింద 10,511 జంటలకు రూ 81.64 కోట్లు విడుదల
  • బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖతాల్లో జమ చేసిన సిఎం జగన్‌మోహన్‌రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పేద ప్రజల్లో చదువుల పట్ల ఆసక్తి, చేయూతనందించేందుకే వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫాల లబ్ధిదారులకు విద్యార్హత నిబంధన పెట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు నేరుగా అందించే పథకాలను గత ప్రభుత్వం ఏనాడూ చిత్తశుద్ధితో అమలుచేయలేదని విమర్శించారు. గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుండి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫాల కింద 10,511 జంటలకు రూ.81.64 కోట్లను బటన్‌నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో జులై నుంచి సెప్టెంబర్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు ఆర్థిక సాయాన్ని నేరుగా అందిస్తున్నామని తెలిపారు. ఎస్‌సిలు, ఎస్‌టిలు, బిసిలు, మైనార్టీలు, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికులు, ఇలా అందరికీ ఈ పథకం అందేలా రూపొందించామన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు 46,062 జంటలకు రూ.349 కోట్లు ఈ పథకాల కింద జమచేసిందన్నారు. గత ప్రభుత్వం ఏనాడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో పథకాలు తీసుకురాలేదని, పేదవాళ్లకు మంచి జరగాలని కోరుకోలేదని అన్నారు. ఈ పథకం ప్రకటించేటప్పుడు ఎందుకు పదో తరగతి సర్టిఫికెట్‌, 18 సంవత్సరాలు తప్పనిసరి అని ప్రశ్నించారని, అందరికీ ఇస్తే ఎక్కువ ఓట్లు వస్తాయన్నారని చెప్పారు. ఓట్లు, ఎన్నికలన్నవి తనకు ముఖ్యం కాదని బాల్య వివాహాలు తగ్గేలా ఒక మంచి లక్ష్యంతో పెట్టామని, వారికి సమాధానంగా చెప్పానన్నారు. పదో తరగతి సర్టిఫికెట్‌ తప్పనిసరి చేయడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించేందుకు మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లవు తుందని అన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపేలా తల్లులను మోటివేట్‌ చేసేలా అమ్మఒడిని తెచ్చామ న్నారు. చదువు అనే అస్త్రంతో పిల్లల తలరాతలు మార్చే గొప్ప వ్యవస్థ రాష్ట్రంలో ఇప్పుడు ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంలో పదో తరగతి నిబంధన లేదని, 2018 నాటికి ఈ పథకాన్ని పక్కన పడేశారని విమర్శించారు. గతంలో రూ.50 వేలను ఇస్తే తమ ప్రభుత్వం రూ.లక్ష ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి కెవి ఉషశ్రీ చరణ్‌, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️