రెండు రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి

తిరుపతి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులే : నారా లోకేష్‌
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :తిరుపతి రాజకీయ పరిణామాలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, రెండ్రోజుల్లో అన్ని సర్దుకుంటాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. కుమారుడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా గురువారం తిరుమల శ్రీవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన నారా లోకేష్‌ను తిరుపతి టిడిపి నాయకులు సుగుణమ్మ, నరసింహయాదవ్‌ కలిశారు. అనంతరం టిడిపి కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కలిశారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ తిరుపతి రాజకీయ పరిణామాలపై నాకు పూర్తి సమాచారం ఉందని, రెండు రోజుల్లో అన్ని సర్దుకుంటాయన్నారు. తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులేనని స్పష్టం చేశారు. తిరుపతి నియోజకవర్గం ప్రజలతో మమేకమై ప్రచారాన్ని ఉధృతం చేయాలని శ్రీనివాసులుకు లోకేష్‌ దిశా నిర్దేశం చేశారు.
సుగుణమ్మకు లోకేష్‌ క్లాస్‌
తిరుపతి జనసేన అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని కోరిన సుగుణమ్మకు నారా లోకేష్‌ క్లాస్‌ తీసుకున్నట్లు సమాచారం. రాజకీయాలలో ఇలాంటివి సహజమేనని, పార్టీ అధికారంలోకి వస్తే తగిన గుర్తింపు ఇస్తామని, పొత్తు ధర్మంగా జనసేన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది.
నారా దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం
లోకేష్‌ కుమారుడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి సేవలో కుటుంబ సభ్యులు పాల్గన్నారు. ఈ సందర్భంగా తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో రూ. 38 లక్షల విరాళాన్ని ఇచ్చారు. అన్నదాన సత్రంలో సందర్శకులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు.

➡️