ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కొనసాగుతున్న దర్యాప్తు

Mar 11,2024 08:05 #enquiry, #praneeth rao

హైదరాబాద్‌: గత ప్రభుత్వంలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి (ఎస్‌ఐబీ) డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌ రావుతో పాటు మరికొంత మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఎస్‌ఐబీ కార్యాలయంలోని రెండు గదుల్లో ఉన్న 17 కంప్యూటర్లను ప్రణీత్‌రావు అనధికారికంగా వాడుకున్నారు. వీటికి ప్రత్యేకంగా ఇంటర్నెట్‌ సదుపాయం పెట్టుకున్నారు. ఇటీవల వీటిల్లో కొన్ని రికార్డులు మాయమైనట్లు అధికారులు గుర్తించారు.ఎలక్ట్రానిక్‌ డివైస్‌లలోని డేటా, ఇతర డాక్యుమెంట్లు మాయ కావడం పోలీసుశాఖతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

సమాచారమంతా తన వ్యక్తిగత పరికరాల్లోకి ప్రణీత్‌ కాపీ చేసుకొని హార్ట్‌ డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మరుసటి రోజు.. గతేడాది డిసెంబర్‌ 4న రాత్రి సీసీటీవీ కెమెరాలను ఆఫ్‌ చేసి కీలక డేటాను ధ్వంసం చేసినట్లు గుర్తించారు. దీంతో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తాజాగా కేసు నమోదుతో ప్రణీత్‌రావును విచారించే అవకాశం ఉంది. ఇటీవలే ఆయనను సస్పెండ్‌ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం డీజీపీ కార్యాలయానికి ప్రణీత్‌ను అటాచ్‌ చేసిన ప్రభుత్వం.. విచారణ తర్వాత సస్పెండ్‌ చేసింది.

➡️