వైసీపీ నేతల ఇసుక దందాకు కలెక్టర్లే సహకరిస్తున్నారు : మాజీ మంత్రి

Feb 15,2024 16:16 #press meet, #tdp ex minister

అమరావతి: వైసీపీ నేతల ఇసుక దందాకు కలెక్టర్లే సహకరిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు అన్నారు. టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఏపీలో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్‌పై కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్లు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బాపట్ల జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా ఇసుక తవ్వకాలు జరగని రీచ్‌కు వెళ్లి, ఎలాంటి అక్రమ మైనింగ్‌ జరగడం లేదని ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు. పక్కనే అక్రమ మైనింగ్‌ జరుగుతున్న చిలువూరు, గాజుల్లంక రీచ్‌లు ఆయనకు కనిపించలేదా? అని నిలదీశారు. పల్నాడు జిల్లా కలెక్టర్‌ పరిశీలించి అక్రమ మైనింగ్‌ జరగలేదని చెప్పిన ఇసుక రీచ్‌లోనే ఓ మీడియాకు చెందిన విలేకరిపై ఎందుకు దాడిచేశారు? అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌ వ్యవహారాన్ని ఆ విలేకరి బయటపెడతాడన్న అక్కసుతోనే వైసీపీ గూండాలు ఆయనపై దాడిచేసి ఆస్పత్రి పాలుచేశారని మండిపడ్డారు.ఏపీలో జరిగే ఇసుక తవ్వకాలకు గ్రీన్‌ ట్రైబ్యునల్‌, కేంద్ర పర్యావరణ శాఖల అనుమతి లేదని చెప్పారు. కలెక్టర్లు తెలిసే తప్పులు చేస్తున్నారని.. ఓటర్ల జాబితాలో అవకతకవలకు పాల్పడిన అధికారులకు పట్టిన గతే ఇసుక దోపిడీకి సహకరిస్తున్న కలెక్టర్లకు పడుతుందని హెచ్చరించారు. ప్రజల సొమ్ము దోచేసే వారికి సహకరిస్తున్న అధికారుల నుంచే జరిగిన నష్టాన్ని భర్తీచేస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే మైనింగ్‌ శాఖ ఎండీ వెంకటరెడ్డికి శిక్ష పడుతుందన్నారు. ఏపీలో జరిగే ఇసుక తవ్వకాలతో జేపీ వెంచర్స్‌.. ప్రతిమా సంస్థలకు ఎలాంటి సంబంధం లేకపోతే, ఆయా సంస్థలు తక్షణమే ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని నక్కా ఆనంద్‌ బాబు డిమాండ్‌ చేశారు.

➡️