శ్రీవారి లడ్డూ ధర తగ్గించలేం

Mar 2,2024 21:50 #press meet, #TTD EO

– ఫిబ్రవరి హుండీ ఆదాయం రూ.111 కోట్లు

– డయల్‌ యువర్‌ ఇఒ కార్యక్రమంలో ఎవి ధర్మారెడ్డి

ప్రజాశక్తి- తిరుమల: శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువు తగ్గలేదని, ధర తగ్గించడానికి వీలులేదని టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో శనివారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఇఒ కార్యక్రమంలో భాగంగా ఓ యాత్రికుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. లడ్డూలు రెండే ఇస్తున్నారు? పది ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మరో యాత్రికుడు అడగ్గా.. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి యాత్రికుడికి ఓ ఉచిత లడ్డూ ఇస్తున్నామని, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలప్పుడు తప్ప, మిగిలిన సయమంలో కావాల్సినన్ని లడ్డూలు యాత్రికులు పొందవచ్చని ఇఒ సమాధానమిచ్చారు.

‘ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.111.71 కోట్లు వచ్చింది. 10.06 లక్షల మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకున్నారు. 95.43 లక్షల లడ్డూలను విక్రయించాం. 6.56 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. ఏప్రిల్‌ నుంచి జులై వరకు యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సామాన్య యాత్రికులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300 దర్శన టికెట్లు తగ్గించాం. తిరుమలలో దాదాపు 7500 గదులు ఉన్నాయి. వీటిలో 45 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంది. దాదాపు 85 శాతం గదులు సామాన్య యాత్రికుల కోసమే కేటాయిస్తున్నాం. వేసవిలో తిరుమలకు తరలివచ్చే వేలాది మంది యాత్రికులకు అవసరమైనన్ని వసతి సౌకర్యం లేనందున తిరుపతిలో వసతి పొందాలి’. అని ఇఒ తెలిపారు.

➡️