25వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి

Feb 12,2024 08:13 #aiyf, #Dharna

సిఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ఎఐవైఎఫ్‌ యత్నం

పలువురి అరెస్టు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ఎఐవైఎఫ్‌ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆదివారం ఆ సంఘం నాయకులు ప్రయత్నించారు. విజయవాడలోని రాష్ట్ర అతిథి గృహం నుంచి ప్రదర్శనగా బయలుదేరిన ఎఐవైఎఫ్‌ నేతలను పోలీస్‌ కమిషనర్‌ బంగ్లా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాయకులు లంకా గోవింద రాజులు మాట్లాడుతూ 23వేల పోస్టులతో డిఎస్‌సి నోటిఫికేషన్‌ ఇస్తానని ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారని తెలిపారు. హామీని అమలు చేయకుండా ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 25వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టులకే నోటిఫికేషన్‌ విడుదల చేసి నిరుద్యోగులను నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25వేల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. తొమ్మిదేళ్ల క్రితం రద్దు చేసిన అప్రెంటీస్‌ విధానాన్ని తిరిగి అమలు చేయాలని చూడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, కేంద్రప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం నోటిఫికేషన్‌కు పరీక్షకు 90 రోజుల గడువు ఉండాలని తెలిపారు. ఈ అంశాన్ని పట్టించుకోకుండా కేవలం 40 రోజుల్లో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ పోస్టులను మొత్తం భర్తీ చేయకపోతే సిఎం జగన్‌ను ఇంటికి పంపడానికి నిరుద్యోగ యువత సిద్ధంగా ఉందని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో ఆ సంఘం నాయకులు షేక్‌ మున్నా, రణత్‌ యాదవ్‌, వియ్యపు రాజు, లక్ష్మణ్‌ తదితరులు ఉన్నారు. అరెస్టులను ఖండించిన సిపిఐ ఎఐవైఎఫ్‌ నాయకులను అక్రమంగా అరెస్టు చేయటాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. 6,100 పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదల చేసి మెగా అంటూ యువతను ప్రభుత్వం దగా చేసిందని పేర్కొన్నారు.

➡️