అసెంబ్లీ బరిలో 2705 మంది.. లోక్‌సభకు 503 మంది

Apr 30,2024 08:34 #2024 election, #ap election, #vote
  •  ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
  •  స్వతంత్ర అభ్యర్ధులకు గ్లాస్‌ గుర్తు
  • ఆందోళనలో కూటమి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : స్వార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 18 నుంచి 25వ తేది వరకు అభ్యర్ధులు నామినేషన్ల వేయగా ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీకి కలిపి మొత్తం 6001 నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో 4,210 మంది ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 1103 నామినేషన్లు రాగా వీరిలో 503 మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2705 మంది బరిలో నిలిచారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీకి అత్యధికంగా 46 మంది, తక్కువగా నగరిలో ఆరుగురు బరిలో నిలిచారు. కుప్పంలో చంద్రబాబుతో సహా 13 మంది పోటీలో ఉండగా, పులివెందులలో జగన్‌తో కలిపి 27 మంది పోటీలో నిలిచారు. నారా లోకేష్‌ పోటీచేస్తున్న మంగళగిరిలో 40 మంది పోటీ చేస్తున్నారు.
జనసేన పార్టీ గుర్తు గ్లాస్‌ ఫ్రీ సింబల్‌ కావడంతో ఎన్నికల కమిషన్‌ కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్ధులకు కూడా కేటాయించింది. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీలో ఉంది. మిగిలిన చోట ఆ పార్టీకి అభ్యర్ధులను నిలపలేదు. దీంతో ఆ పార్టీ గుర్తు స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించడంతో టిడిపి-జనసేన-బిజెపి కూటమిలో ఆందోళన నెలకొంది. కూటమి నుంచి టికెట్‌ దక్కని ఆశావాహులు పలుచోట్ల రెబల్స్‌గా బరిలోకి దిగారు. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, మైలవరం స్వతంత్ర అభ్యర్ధి వల్లభనేని నాగ పవన్‌కుమార్‌, విజయవాడ సెంట్రల్‌లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్ధి గొల్లపల్లి ఫణిరాజ్‌, టెక్కలిలో స్వతంత్ర అభ్యర్ధి అట్టాడ రాజేష్‌, కాకినాడ జిల్లా జగ్గంపేట స్వతంత్ర అభ్యర్ధి పాఠంశెట్టి సూర్యచంద్ర, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కుమారుడు నంబూరు కళ్యాణ్‌ బాబు, గన్నవరంలో స్వతంత్ర అభ్యర్ధి వల్లభనేని వంశీమోహన్‌ కృష్ణ, మంగళగిరిలో రావు సుబ్రహ్మణ్యం, మదనపల్లెలో షాజహాన్‌లకు ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు గ్లాస్‌ గుర్తును కేటాయించారు. అదేవిధంగా అనకాపల్లి పార్లమెంట్‌ అభ్యర్ధిగా బరిలో ఉన్న దళిత బహుజన పార్టీకి చెందిన వి.కృష్ణస్వరూపకు కూడా గ్లాస్‌ గుర్తును ఎన్నికల అధికారి కేటాయించారు. స్వతంత్ర అభ్యర్ధులతో పాటు కూటమి అభ్యర్ధులకు కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో కూటమిలో గుబులు పట్టుకుంది.

➡️