వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర

  •  ఎపి రైతు సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య

ప్రజాశక్తి – కాకినాడ : భారతదేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య అన్నారు. ‘ఢిల్లీలో రైతాంగ పోరాటం విశిష్టత-కార్మిక, ప్రజా మద్దతు ఆవశ్యకత’ అనే అంశంపై విఎస్‌ఆర్‌ ఐడియల్‌ స్టడీ సెంటర్‌ ఆధ్వర్యాన కాకినాడలోని యుటిఎఫ్‌ హోమ్‌లో సోమవారం సదస్సు నిర్వహించారు. ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకుడు వాసంశెట్టి సూర్యారావు 5వ వర్థంతి సందర్భంగా నిర్వహించిన ఈ సదస్సులో కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రంలో మోడీ నాయకత్వంలో నడుస్తున్న బిజెపి ప్రభుత్వం వ్యవసాయ భూములను కారు చౌకగా అదానీ, అంబానీలకు అప్పగించేందుకు కుట్రలు చేస్తోందన్నారు. అందులో భాగమే మూడు వ్యవసాయ చట్టాలని తెలిపారు. కోట్లాది మంది రైతాంగాన్ని దగా చేసి అప్రజాస్వామికంగా పార్లమెంట్‌లో వ్యవసాయ నల్ల చట్టాలను ఆమోదించిందని విమర్శించారు. అందుకు ప్రతిఫలమే బిజెపి ఎన్నికల బాండ్లు రూపంలో రూ.వేల కోట్ల ముడుపులు అందుకుందని అన్నారు. రైతు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించి చట్టం తెస్తానన్న మోడీ అందుకు భిన్నంగా మొత్తం వ్యవసాయాన్ని రైతుల నుంచి గుంజుకుంటోందని విమర్శించారు.

➡️