15 నుంచి ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు

  • వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : డిసెంబర్‌ 15, 16, 17న కర్నూలులో నిర్వహించే ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం నాయకులు కోరారు. నగరంలోని కార్మిక, కర్షక భవన్‌లో ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల వాల్‌ పోస్టర్‌ను, ఆహ్వాన సంఘం కరపత్రాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం అధ్యక్షులు పి.తిక్కారెడ్డి మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించుకునేందుకు ఈ సమావేశాలు తోడ్పడతాయన్నారు. రైతులకు వనరులు కల్పించే స్థితిలో రాజకీయ పార్టీలు లేవని, ప్రాజెక్టుల కోసం పోరాటం చేస్తోన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 20 ఎకరాలున్న రైతులు కూడా వలస పోతున్నారని, అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌ ఆగ్రోస్‌ అధినేత వాహిద్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ.. రైతే దేశానికి వెన్నెముక అనేది మాటల వరకే పరిమితమైందన్నారు. సంక్షోభం నుంచి రైతులను సంక్షేమం వైపు తీసుకొచ్చేందుకు ఈ సమావేశాలు తోడ్పడతాయని తెలిపారు. రవీంద్ర విద్యాసంస్థల డైరెక్టర్‌ జి.పుల్లయ్య మాట్లాడుతూ.. వ్యవసాయ యోగ్యమైన భూమి నిరుపయోగంగా మారిపోతోందన్నారు. ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ ఎన్‌.శమంతకమణి మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాలు కల్తీ అయిపోతున్నాయని, వాటిని కొని రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి, ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా 15న నగరంలోని పాత బస్టాండ్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఈ సభలో కేరళ ఆర్థిక శాఖ మంత్రి కె.బాలగోపాల్‌, ఎఐకెఎస్‌ జాతీయ అధ్యక్షులు అశోక్‌ ధావలే, ప్రధాన కార్యదర్శి విజ్జుకృష్ణన్‌, ఉపాధ్యక్షులు హన్నన్‌మొల్ల హాజరవుతారని తెలిపారు. ఆహ్వాన సంఘం సభ్యులు పి.నిర్మల, డి.గౌస్‌ దేశారు, కెవి.నారాయణ, పిఎస్‌.రాధాకృష్ణ, బి.రామాంజనేయులు పాల్గొన్నారు.

➡️