ఉత్తరాంధ్ర అభివఅద్ధికై చిత్తశుద్దిగా నిలవండి : అజశర్మ

Apr 13,2024 19:18 #aja sarma, #speech, #vijayanagaram

ప్రజాశక్తి -విజయనగరం టౌన్‌ :ఉత్తరాంధ్ర అభివృద్ధి కి ఎన్నికల్లో పోటీచేస్తున్న వారు చిత్తశుద్ధిగా నిలబడాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యదర్శి ఏ.అజశర్మ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం స్థానిక ఎల్‌బిజి భవనంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎం శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో ముందుగా ఉత్తరాంధ్ర మేనిఫెస్టో 2024ను ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ. అజశర్మ, జిల్లా ఆర్గనైజర్‌ ఎం.శ్రీనివాస్‌, ఎల్‌ఐసి రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం నాయకులు వి జగన్నాథ స్వామి, పట్టణ పౌరుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వి రామచంద్రరావు ఆవిష్కరించారు .అనంతరం అజశర్మ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కావలసిన ప్రణాళికలు ఈ మానిఫెస్టోలో ఉత్తరాంధ్ర అభివఅద్ధి వేదిక తెలియజేసిందన్నారు. అపారమైన వనరులున్న ఉత్తరాంధ్ర నేటికీ వెనుకబాటులో ఉండడానికి ప్రధాన కారణం పాలకులు నిర్లక్ష్యం తప్ప మరోకటికాదన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి కాకుండా, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం అత్యంత విచారకరమన్నారు. ఈ ప్రాంతాన్ని గత పదేళ్ళలో ఏమాత్రం అభివఅద్ధి సాధించకుండా పాలకులు అవకాశవాదం ప్రదర్శించారన్నారు. రాష్ట్ర విభజన చట్టం అమలు చేయలేదన్నారు. దీనివల్ల ఈ పదేళ్ల కాలంలో ఉత్తరాంధ్ర మరింత వెనుకబాటులోకే నెట్టబడిందన్నారు. ఇది చాలా దున్నట్లు కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ను అమ్మేయాలని నిర్ణయించిందన్నారు. వివిధ ప్రాజెక్టుల పేరుతో ఉత్తరాంధ్రలో విస్తారంగా ఉన్న అటవీ భూములను కార్పోరేట్లకు ధారాదత్తం చేసి, గిరిజనులను రోడ్లమీదకు నెట్టాలని చూస్తోందన్నారు. సముద్రంతో సహా సహజ వనరులు అన్నిటిని కార్పొరేట్‌ పరం చేస్తోందన్నారు. రాష్ట్రం, ఈ ప్రాంత అభివఅద్ధికి కట్టుబడవలసిన తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆ పని చేయకపోగా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపితో జతకట్టాయన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బిజెపికి సహకరించేలా రాష్ట్ర వైసిపి జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. అందువల్ల రాష్ట్రంలోని ఈ మూడు ప్రధాన పార్టీల అవకాశవాదాన్ని ఎండగట్టి ప్రత్యామ్నాయం వైపు ప్రజల ఆలోచించాలని, రాష్ట్రం, ఉత్తరాంధ్ర అభివృద్ది, స్టీల్‌ ప్లాంట్‌ రక్షణకై నిలవాలని ఈ సదస్సులో ప్రజలకు పిలుపునిచ్చారు. సదస్సులో మేధావులు,వివిధ ప్రజా సంఘాలు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️