అణచాలని చూస్తే అగ్నిగుండమే : సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాదేవి

Jan 1,2024 16:31 #Bapatla District
anganwadi workers strike 21 day bapatla

ప్రజాశక్తి – అద్దంకి : పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మాట తప్పి మడమ తిప్పుతూ అంగన్వాడీ ఉద్యమాన్ని అణచాలని చూస్తే ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండంగా మారుతుందని మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి అన్నారు. గత 20 రోజులుగా సమ్మె చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాపట్ల జిల్లా అద్దంకిలో అంగన్వాడి శిబిరాన్ని సోమవారం ఆమె సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల క్రితం అంగన్వాడీ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు నేడున్న ఆర్థిక పరిస్థితులు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అధిక ధరలు, అధిక పన్నులు, అధిక కరెంటు చార్జీలు, పెరిగిన ఇంటి అద్దెలు, పెరిగిన నీటి చార్జీలు తదితర విషయాల్లో అదనంగా వచ్చిన మార్పుల గురించి అంగన్వాడీలు వివరించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చేదానికి భారాల రూపంలో ప్రజల నుంచి తిరిగి లాక్కునే దానికి చాలా వ్యత్యాసం ఉందని తద్వారా ప్రభుత్వం ప్రజల నుండి లాభపడుతుందే తప్ప నష్టపోవటం లేదని అన్నారు. తల్లి తర్వాత తల్లి లాంటి పాత్ర పోషించే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడానికి డబ్బులు లేవని సాకులు చెప్తున్నారని డబ్బులు లేనప్పుడు స్మార్ట్ మీటర్ల కోసం 20వేల కోట్లు ఎలా కేటాయించారని ఆమె నిలదీశారు. డబ్బులు లేవని చెప్పే ప్రభుత్వం మూడు రాజధానులను ఎలా నిర్మిస్తుందని ప్రశ్నించారు. డబ్బులు లేవని చెప్తున్న ప్రభుత్వం 450 కోట్లతో విశాఖ లో ముఖ్యమంత్రికి ఇల్లు ఎలా నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు, మాజీ మంత్రులు కలిసి న్యాయమైన డిమాండ్ లేనని సమర్థిస్తూనే ఇవేవీ రాష్ట్ర ముఖ్యమంత్రి కి తెలియని ఆయనకు తెలియజేసి తగిన న్యాయం జరిగేలా చూస్తామని వైసిపి నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని పరదాల చాటున పర్యటిస్తూ ప్యాలెస్లలో నివసించే ముఖ్యమంత్రికి తెలియదని చెబితే మోసపోయే ప్రజలు ఎవరూ లేరని ఆమె విమర్శించారు. అంగన్వాడీలకు ఉద్యమాలు, అణిచివేతలు కొత్త ఏం కాదని ఉమ్మడి రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువ బెదిరింపులను ఎదుర్కొని ఎన్నికల్లో ప్రభుత్వాలకు బుద్ధి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న లక్ష మంది అంగన్వాడీలు ఇంటికి మూడు ఓట్లు చొప్పున మూడు లక్షల కోట్లు మళ్లీ ఇస్తే ప్రభుత్వం తారుమారవుతుందని హెచ్చరించారు. అంగన్వాడీ ఉద్యమానికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంగాల మద్దతును కూడగట్టటం తోపాటు ఆయా అంగన్వాడి కేంద్రాల పరిధిలో ఉన్న ప్రజల మద్దతును కూడగడతామని తద్వారా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చేసుకొని అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని తద్వారా సమ్మెను విరమింప చేయాలని ఆమె డిమాండ్ చేశారు. డిసెంబర్ 3న కలెక్టరేట్ల వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయటం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు అంగన్వాడి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️