ఐదేళ్లలో కొత్త బస్సులు ఏవీ?

Mar 7,2024 09:16 #APSRTC, #new buses
  •  కాలం చెల్లిన వాటితోనే ప్రయాణం 
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్‌టిసి ఉద్యోగ సంఘాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఈ ఐదేళ్లలో ఎపిఎస్‌ఆర్‌టిసి సొంత బస్సును ఒక్కటి కూడా కొనకుండా హైర్‌ బస్సులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. సాధారణంగా ఆర్‌టిసి ప్రతియేటా రెండు వేలకు పైగా కొత్త బస్సులను కొంటేగానీ కాలం చెల్లిన వాటి స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. గత ఐదేళ్లుగా పాత బస్సులనే నడిపిస్తుండటంతో ఆర్‌టిసిలో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. తెలంగాణ గతేడాది వెయ్యి బస్సులకు పైగా కొత్త బస్సులను కొనుగోలు చేసి రోడ్లపై తిప్పుతుండగా, ఎపిఎస్‌ఆర్‌టిసి మాత్రం కాలం చెల్లిన బస్సులతోనే కాలం వెళ్లబుచ్చుతుండటం పట్ల ఆర్‌టిసి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏ బస్సయినా 8 లక్షల కిలోమీటర్లు నడవగానే దానిని పూర్తిగా పక్కన పెట్టేయాలి. కానీ 11 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులనూ ఆర్‌టిసి రోడ్డుపై నడుపుతోందంటే ప్రయాణికుల భద్రతకు ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అవగతమవుతోంది. ఎపిఎస్‌ఆర్‌టిసిలో మొత్తం 129 డిపోల పరిధిలో 11,335 బస్సులుంటే ఇందులో హైర్‌ బస్సులు 2,600 వరకూ ఉన్నాయి. ఇప్పుడు ఎపిఎస్‌ఆర్‌టిసి మరో 541 బస్సులను అద్దె ప్రాతిపాదికన తీసుకునేందుకు టెండర్లను పిలిచింది. కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడంతో రెగ్యులర్‌ సర్వీసులను నడిపేందుకు తప్పని పరిస్థితిలో కాలపరిమితి తీరిన బస్సులనే వినియోగిస్తున్న పరిస్థితి వుందని ఆర్‌టిసి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త బస్సుల కొనుగోలు లేకుండా మొత్తం హైర్‌ బస్సులతోనే ఎపిఎస్‌ఆర్‌టిసిలో బస్సు సర్వీసులు నడిపేలా ప్రభుత్వం నిర్ణయం పట్ల ఆర్‌టిసి ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దూర ప్రాంతాలకు తిరిగే ఎసి బస్సులు మినహా సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌, పల్లెవెలుగు ఇలా అన్ని రకాల సర్వీసులకు హైర్‌ బస్సులను తీసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతున్న తీరు పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రూ.570 కోట్లతో కొత్తగా 1,500 డీజిల్‌ బస్సులను ఆర్‌టిసి కొనుగోలు చేసేందుకు టెండర్లను పిలిచినా ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా ఆర్‌టిసిలోకి రాని పరిస్థితి వుంది. డిసెంబరు నాటికి కొత్త బస్సులు ప్రవేశపెడతామన్న ఆర్‌టిసి అధికారుల మాటలు నీటి మూటలు అయ్యాయి తప్ప ఆర్‌టిసిలోకి 2024 మార్చి నెలా వచ్చినా ఒక్క బస్సు రాలేదు. అలాగే మరో వెయ్యి విద్యుత్‌ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు టెండర్లను పిలిచారు. ఇప్పటి వరకు తిరుపతి కేంద్రంగా నడిపేందుకు 100 విద్యుత్‌ బస్సులు తప్ప కొత్త బస్సు ఒక్కటి కూడా రాలేదు. విద్యుత్‌ బస్సులు వెయ్యి, డీజిల్‌ బస్సులు 1,500 కలిపి మొత్తం 2,500 కొత్త బస్సులు వస్తున్నాయని ప్రభుత్వం ఏడాది కాలంగా చెబుతున్నా కార్యరూపం దాల్చలేదు. ఆర్‌టిసికి సొంత వాహనాలు లేక మొత్తం హైర్‌ బస్సులపైనే ఆధారపడితే.. భవిష్యత్‌లో యజమానులు తమ డిమాండ్ల సాధన కోసం హైర్‌ బస్సులన్నీ ఒకేసారి నిలిపేస్తే ప్రజా రవాణా పరిస్థితి ఏమటనేది చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వం ప్రజా రవాణాకు భరోసా కల్పించేలా ఆర్‌టిసికి సొంత బస్సులు కొనుగోలు చేయాలని ఉద్యోగులు, ప్రయాణికులు కోరుతున్నారు.

➡️