మీడియాపై పోలీసులు దౌర్జన్యానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఖండన

apjwf condemn on police fire on media

ప్రజాశక్తి-విజయవాడ : ఆదివారం అర్ధరాత్రి విజయవాడ ధర్నా చౌక్ లో అంగన్వాడి వర్కర్స్ పై పోలీసులు దౌర్జన్యంగా విరుచుకుపడి అరెస్టు చేస్తున్న సందర్భంగా వార్తల కవరేజ్ కి వెళ్ళిన విలేకరులు, ఫోటోగ్రాఫర్లపై విజయవాడ డిసిపి విశాల్ గున్ని నాయకత్వంలో పోలీసులు పెద్ద ఎత్తున దౌర్జన్యానికి పాల్పడడం పట్ల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు ఎస్ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు పత్రికా ప్రకటన విడుదల చేశారు.  విజయవాడ చరిత్రలోనే విలేకరులపై ఇంత పెద్ద ఎత్తున పోలీసులు దౌర్జన్యానికి పాల్పడడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. ఫోటోగ్రాఫర్లను పోలీస్ వ్యాన్లెక్కించి అరెస్టు చేసి తీసుకుపోబోయారని తెలిపింది. దాన్ని ఫోటోగ్రాఫర్లు ప్రతిఘటించడంతో వారిని విడిచిపెట్టారని పేర్కొంది. ప్రజాశక్తి ఫోటోగ్రాఫర్ రామును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారని, మరో ప్రజాశక్తి ఫోటోగ్రాఫర్ రమణ పై దౌర్జన్యంగా వ్యవహరించారని మండిపడింది. ‘మేము మీడియా ఫోటో తీస్తున్నాం సార్, వార్తలు కవరేజ్ కి వచ్చామంటే…’ ”మీడియా అయితే ఏమిటి” అంటూ డిసిపి విశాల్ గున్ని నిర్లక్ష్యంగా మాట్లాడారని తెలిపింది. ఆయన కింది పోలీస్ అధికారులు మరింత రెచ్చిపోయి మీడియాపై దౌర్జన్యంగా వ్యవహరించారని ఆగ్రహించారు. పోలీసుల తీరును ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. మీడియాపై దౌర్జన్యానికి పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

➡️