కేంద్రం సిఫార్సులతోనే తెచ్చాం.. ల్యాండ్‌ టైటిల్‌యాక్ట్‌పై సజ్జల

Doubts-on-Chandrababu%27s-medical-report-Sajjala

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం సిఫార్సులతోనే రాష్ట్రంలో ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ను తీసుకువచ్చామనివైసిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ చట్టాన్ని విమర్శిస్తున్న టిడిపి. జనసేనలకు చిత్తశుద్ది ఉంటే దీనిపై బిజెపిని నిలేయాలని సవాల్‌ చేశారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ మీద విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆ చట్టం మీద అనుమానాలు ఉంటే బిజెపినుండే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు నివృత్తి చేసుకోవాలి తప్ప వైసిపిపై దుష్ప్రచారం తగని అన్నారు. తెలుగుదేశం, జనసేనలు విడుదల చేసిన మేనిఫెస్టో పెద్ద అబద్దాల పుట్ట అని అన్నారు. కూటమి అన్ని సాధ్యం కాని హామీలనే ప్రకటించిందని అన్నారు. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ప్రజలకు చేయగలిగినవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ఏమాత్రం అర్థం చేసుకోకుండా ఇష్టారాజ్యంగా హామీలను టిడిపి. జనసేనలు ప్రకటించాయని తెలిపారు. 2014లో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారన్నారు. రాష్ట్రంలో వృద్దులకు ఇబ్బంది లేకుండా వలంటీర్ల ద్వారా అందుతున్న పెన్షన్లను అడ్డుకోవడంతో ఇపుడు బ్యాంకుల వద్ద పెన్షన్‌ లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోందని అన్నారు. వద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి భాద్యత చంద్రబాబుదేనని విమర్శించారు. కూటమి మేనిఫెస్టోలో బిజెపి ఫోటోలు ఎందుకు లేవని, అదే బిజెపి సిక్కిం, అరుణాచలప్రదేశ్‌ రాష్ట్రాలలో కూటమితో కలిసి మేనిఫెస్టో ఎలా ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు.

‘జగన్‌ కోసం సిద్దం’ ప్రచార రథాలు ప్రారంభం
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంతో లభ్దిపొందిన లబ్దిదారులే స్టార్‌ క్యాంపెయినర్‌లుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు ‘జగన్‌ కోసం సిద్దం’ ప్రచార రథాలను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుండి ఈ ప్రచార రథాలను ఆయన ప్రారంభించారు.

➡️