కురుపాం నుంచి సిపిఎం పోటీ

– రానున్న ఎన్నికల్లో బిజెపిని తరిమికొడదాం

– ఆ పార్టీకి వంతపాడే టిడిపి, జనసేన, వైసిపిని ఓడిద్దాం

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తులసీదాస్‌

ప్రజాశక్తి – కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) :రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల బరిలో ఉంటారని, ప్రజలంతా సంపూర్ణంగా మద్దతి ఇచ్చి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ కోరారు. కురుపాంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.అవినాష్‌ ఆధ్వర్యాన సిపిఎం ఎన్నికల విస్తృతస్థాయి సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో తులసీదాస్‌ మాట్లాడుతూ.. కురుపాం నియోజకవర్గంలో గిరిజన, పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన సిపిఎం పోరాడి వారి హక్కులను సాధించిందన్నారు. అంతేకాకుండా నిరంతరం వారితో ఉంటూనే వారి పక్షాన పోరాడుతుందని తెలిపారు. మతోన్మాద సిద్ధాంతాలతో కేంద్ర ప్రభుత్వం ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతోందని తెలిపారు. దేశ సంపదను కొల్లగొట్టి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఉసేలేదన్నారు. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేయడానికి చూస్తోన్న బిజెపికి తోత్తులుగా వైసిపి, టిడిపి, జనసేన వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఇటువంటి పార్టీలను సాగనింపడానికి సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ ఏకమవుతూ రానున్న ఎన్నికల్లో ఓ వేదికగా రాష్ట్రంలో పోటీ చేస్తున్నాయని తెలిపారు. ప్రజలంతా ఈ వేదికను గెలిపించడానికి ముందుకు రావాలని కోరారు. రానున్న ఎన్నికల్లో మతోన్మాద బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించి, దానికి వంతపాడే టిడిపి, జనసేనను తరిమికొట్టాలని, నిరంకుశ వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్నారు. సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ కురుపాంలో సిపిఎం అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని, ఈ నెల 10న జరిగే మన్యం బంద్‌తోనే మన ఎన్నికల ప్రచారం ప్రారంభమవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బారావమ్మ, జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.మన్మధరావు కె.గంగునాయుడు, పాల్గొన్నారు.

➡️