నిండా మునిగాం..

center team visit drought areas in ap

తేరుకోలేని దెబ్బ తగిలింది… ఆదుకోండి
కేంద్ర బృందం వద్ద రైతుల ఏకరువు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో హడావిడిగా పర్యటన

ప్రజాశక్తి- కృష్ణాప్రతినిధి, అమర్తలూరు (బాపట్ల జిల్లా) : ‘నిండా మునిగాం. తేరుకోలేని దెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అదుకోవాలి. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చూడాలి’ అని పలువురు రైతులు కేంద్ర బృందం వద్ద ఏకరువు పెట్టారు. మిచౌంగ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాలైన కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అంతర్‌ మంత్రిత్వ కేంద్ర బృందం (ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీం) బుధవారం పర్యటించింది. ఈ బృందానికి పలువురు వినతి పత్రాలు అందజేశారు. జాతీయ విపత్తు నిర్వహణ (ఎన్‌డిఎం) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేంద్ర రత్నూ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎడి మహేంద్ర చందేలియా, కేంద్ర రోడ్డు రవాణా హైవేస్‌ మంత్రిత్వ శాఖ విజయవాడ ప్రాంతీయ కార్యాలయ అధికారి రాకేష్‌ కుమార్‌తో కూడిన బృందం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు, పామర్రు మండలం నిమ్మలూరు, గుడివాడ మండలం రామన్నపూడి, వలివర్తిపాడు గ్రామాల్లో నేలవాలి నీట మునిగి మొలకలొచ్చిన వరి పొలాలను పరిశీలించింది. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం గోవాడలో రైతులతో మాట్లాడింది. కంకిపాడు, గోవాడల్లో ఏర్పాటు చేసిన తుపాను నష్టాల ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో జరిగిన నష్టాన్ని జాయింట్‌ కలెక్టర్‌ అపరాజితాసింగ్‌ కేంద్ర బృందానికి వివరించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 2,54,655 ఎకరాల్లో వరి, 2284 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. 312.23 కిలోమీటర్ల మేర 57 ఆర్‌అండ్‌బి రహదారులు, 17.16 కిలోమీటర్ల మేర ఆరు పంచాయతీరాజ్‌ శాఖ రహదారులు దెబ్బతిన్నాయని వివరించారు. బాపట్ల జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీధర్‌ కేంద్ర బందానికి పంట నష్టం వివరాలను తెలియజేశారు.

షెడ్యూల్‌ ప్రకారం సాగని పర్యటన

కేంద్ర బృందం పర్యటన షెడ్యూల్‌ ప్రకారం సాగలేదు. కృష్ణా జిల్లా పామర్రు మండలం యలకుర్రు, ప్రాతూరు, గుడివాడ మండలం లింగవరంలో కేంద్ర బృందం పర్యటించాల్సి ఉంది. కానీ, ఆలస్యమై చీకటి పడిందనే కారణంతో ఆయా గ్రామాల్లో పర్యటించకుండానే వెనుతిరిగింది.ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా పరిహారం పెంచాలి : రైతు సంఘాల సమన్వయ సమితితుపానుకు నష్టపోయిన రైతులు, కౌలు రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వడ్దే శోభనాద్రీశ్వరరావు, ఎపి రైతు, ఎపి కౌలు రైతు సంఘాల రాష్ట్ర నాయకులు వై.కేశవరావు, ఎం.హరిబాబు, తెలుగు రైతు రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.ఉమావరప్రసాద్‌ కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. కంకిపాడు మండలం దావులూరులో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ఎన్యూమరేషన్‌ సక్రమంగా చేయాలని విన్నవించారు. బాధితుల జాబితాలో కౌలు రైతుల పేర్లనూ చేర్చాలని కోరారు. పంట నష్టపరిహారాలు చాలా తక్కువగా ఉన్నాయని, వాటిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. పదేళ్ల క్రితమే భూపేంద్రసింగ్‌ హుడా కమిటీ ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని చేసిన సూచనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని, ఆ కమిటీ సూచన చేసినప్పటికి, ఇప్పటికీ ఉత్పత్తి ఖర్చులు రెట్టింపయ్యాయని వివరించారు. అందుకనుగుణంగా ఇన్‌పుట్‌ సబ్సిడీ పెంచాలని కోరారు. ధాన్యం సేకరణ నిబంధనలు సడలించి దెబ్బతిన్న ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండో పంటగా చల్లిన అపరాలు మునిగిపోయాయని, అపరాల రైతులకు విత్తనాలు అందించాలని కోరారు. దెబ్బతిన్న వాణిజ్య పంటలకూ పంటల బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని, డ్రెయిన్ల అభివృద్ధికి కేంద్రం గ్రాంట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర బృందానికి ఎంఎల్‌ఎలు సారథి, అనిల్‌, పలువురు టిడిపి నేతలు కూడా వినతి పత్రాలు అందజేశారు.

➡️