ప్రజాసమస్యల పరిష్కారానికి త్వరలో ప్రత్యేక వేదిక : సిఎం చంద్రబాబు

Jun 30,2024 06:33 #chandrababu, #speech
  • టిడిపి కార్యాలయంలో వెల్లువెత్తిన వినతులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రజాసమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి టిడిపి కార్యాలయానికి తరలివచ్చిన ప్రజల నుంచి శనివారం ఆయన వినతులు స్వీకరించారు. సామాన్య ప్రజలు, కార్యకర్తలు ముఖ్యమంత్రిని కలిసేందుకు భారీగా తరలిరావడంతో టిడిపి కార్యాలయం కిక్కిరిసిపోయింది. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడటంతో కొంతసేపు వినతిపత్రాల స్వీకరించడాన్ని నిలిపివేశారు. సర్దుబాటు అయిన తరువాత మరలా స్వీకరించారు. అందరి నుంచి వినతిపత్రాలు తీసుకున్న చంద్రబాబు వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారీగా తరలివస్తున్న ప్రజలను కలిసేందుకు ఇకపై ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఐదేళ్లు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వెల్లువలా వస్తున్న ఈ విన్నపాలను చూస్తే అర్థమవుతోందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. గత ప్రభుత్వం సరిగా పనిచేయనందునే సమస్యలతో ప్రజలు భారీగా వస్తున్నారని చెప్పారు. ప్రజా ఇబ్బందులు చూస్తుంటే ఎంతో బాధనిపిస్తోందని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో కూడా ప్రజా సమస్యలు గుర్తించి వాటికి సత్వర పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

➡️