సమ్మె కాలపు హామీలు అమలు చేయాలి

Feb 16,2024 08:32 #CITU, #municipal workers, #Protest
  • పలుచోట్ల మున్సిపల్‌ కార్మికుల ఆందోళనలు

ప్రజాశక్తి-యంత్రాంగం : సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలపై జిఒలు విడుదల చేయాలని కోరుతూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన మున్సిపల్‌ కార్మికులు గురువారం రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమ్మె ముగిసి 35 రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకాలేదని తెలిపారు. ఈ నెల 20వ తేదీ లోపు ప్రభుత్వం ఇచ్చిన సమ్మె కాలపు హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు, ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద మున్సిపల్‌ కార్మికులు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఫ్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ధర్నాలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సమ్మె విరమణ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను జిఒ రూపంలో విడుదల చేయకపోవడం శోచయమన్నారు. వెంటనే మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జిఒ విడుదల చేసే వరకూ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. మున్సిపల్‌ కార్మికుల ధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మద్దతు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. నంద్యాలలో మున్సిపల్‌ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్లకు వినతిపత్రాలు అందించారు.

➡️