CM Chandrababu: గాడి తప్పిన వ్యవస్థలను దారిన పెడతా

Jun 13,2024 23:00 #CM Chandrababu, #IAS and IPS, #meet
  • ఐఎఎస్‌, ఐపిఎస్‌లతో సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలను దారిన పెడతానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు ఐఎఎస్‌, ఐపిఎస్‌లు ముఖ్యమంత్రిని కలిసి గురువారం శుభాకాంక్షలు తెలిపారు. 1995లో తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యానని, అప్పుడు తనతో పనిచేసిన వారిలో కొందరు ఇక్కడ ఉండి ఉంటారని చెప్పారు. నాలుగోసారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని, రాష్ట్రంలో నేడు చూసిన దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అత్యంత గౌరవప్రదమైన ఉద్యోగాలు అని తెలిపారు. ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాల నుంచి నియామకమవుతారని వివరించారు. ఇక్కడున్న కొందరు అధికారులు గతంలో ఆదర్శవంతంగా పనిచేశారని అన్నారు. గత ఐదేళ్లలో మాత్రం ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని వారికి చెప్పారు. పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదన్నారు. డిపార్టుమెంట్లన్నీ నిస్తేజమయ్యాయని, సిస్టమ్స్‌ అన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టం మేరకే ఎవరైనా పని చేయాల్సి ఉంటుందన్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడటం లేదని, ఎప్పుడూ మాట్లాడనని చెప్పారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించే తన బాధ అని పేర్కొన్నారు. పరిపాలన గాడిలో పెట్టే విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటానని తెలిపారు. త్వరలో అందరితో మరలా మాట్లాడి పాలనను చక్కదిద్దుతానని చెప్పారు. అనంతరం తన కార్యాలయం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మీడియా ప్రతినిధులను చూసి కారు ఆపి వారితో మాట్లాడారు. చంద్రబాబుకు ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో వార్తలు కవర్‌ చేసే తాము ఐదేళ్ల తరువాత ముఖ్యమంత్రిని కలిశామని సిఎంతో ప్రతినిధులు అన్నారు.

➡️