చంద్రబాబు స్క్రిప్ట్‌ చదివేవారు వైఎస్‌ వారసులా?

Apr 25,2024 10:59 #ap cm jagan, #Kadapa, #nomination
  • పసుపు చీరకట్టుకుని వాళ్ల కుట్రలో భాగస్వాములయ్యారు
  • అవినాష్‌ తప్పుచేయలేదని నమ్మా…అందుకే టిక్కెట్టు ఇచ్చా
  • పులివెందులలో సిఎం వైఎస్‌ జగన్‌ భావోద్వేగ ప్రసంగం

ప్రజాశక్తి-కడప : ఒక్కడిగా తనను ఎదుర్కోలేని చంద్రబాబు గుంపుగా వస్తున్నారనీ, ఆయన స్క్రిప్టు చదువుతున్న కొందరు ఇప్పుడు తామే అసలైన వైఎస్‌ వారసులమంటూ చెప్పుకోవటం సిగ్గుచేటని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి విమర్శించారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసిపి అధ్యక్షుడు, సిఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి గురువారంనాడు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులతో ర్యాలీగా వెళ్లారు.అ నంతరం జరిగిన సభలో సిఎం జగన్‌ భావోద్వేగంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రసంగం మొత్తం ఆయన మాటల్లోనే…అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను. నా సొంత గడ్డ, నా పులివెందుల, నా ప్రాణం. ప్రతీ కష్టంలో పులివెందుల నా వెంట నడిచింది. పులివెందుల అంటే నమ్మకం, అభివృద్ధి, ఒక సక్సెస్‌ స్టోరీ. మంచి మనసు, బెదిరింపులకు లంగకపోవడం మన కల్చర్‌. పులివెందుల ఒక విజయగాథ. మంచి చేయడం, మాట తప్పకపోవడం మన కల్చర్‌. టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాల్ని ఎదురించింది పులివెందుల బిడ్డలే. కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు కృష్ణా నది నీళ్లు వస్తున్నాయి. పులివెందుల కల్చర్‌, కడప కల్చర్‌, రాయలసీమ కల్చర్‌ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. ఈ అభివృద్ధికి కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డే ముఖ్యకారణం. వైఎస్సార్‌, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్సార్‌ వారసులమని. వారి కుట్రలో భాగంగా ప్రజల మధ్యకు నా సోదరీమణులు వస్తున్నారు. వైఎస్సార్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసింది ఎవరు? నాన్నపై కక్షతో, కుట్రతో ఆయనపై కేసులు పెట్టింది ఎవరు? ఆ కుట్రలు చేసిన పార్టీలో చేరిన వాళ్లు.. వైఎస్సార్‌ వారసులా? ఆ మహానేతకు వారసులు ఎవరనేది చెప్పాల్సింది ప్రజలే. వైఎస్సార్‌ లెగసీని లేకుండా చేయాలని చూసింది ఎవరు? వైఎస్సార్‌ పేరును సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది ఎవరు?.వైఎస్సార్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసింది ఎవరు? మీ బిడ్డను ఎదుర్కోలేక.. ఒక్కరి మీదకు ఇంతమంది ఏకమైతున్నారు. కానీ సంక్షేమం, అభివృద్ధిలో వైఎస్సార్‌ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం. పసుపు చీర కట్టుకుని వాళ్ల కుట్రలో భాగమైన వీళ్లా వైఎస్సార్‌ వారసులు?. వైఎస్సార్‌పై కుట్రలు చేసిన వాళ్లు ఇస్తున్న స్క్రిప్ట్‌లు చదువుతున్న వాళ్లు.. వైఎస్సార్‌ వారసులా?. వైఎస్‌ వివేకానందను చంపింది ఎవరో అందరికీ తెలుసు. వైఎస్‌ వివేకాను నేనే చంపాను అన్న వ్యక్తి బయట తిరుగుతున్నారు. అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను. వివేకాను చంపిన నిందితుడికి మద్దతిస్తుంది ఎవరు? వివేకాకు రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా? అవినాష్‌ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా? అవినాష్‌ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు’ అంటూ విమర్శించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపి అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గన్నారు.

➡️