ఇంటింటికి వెళ్లండి

Feb 28,2024 09:11 #ap cm jagan, #meetings, #YCP
  • – ఈ 45 రోజులే కీలకం
  • -జరిగిన మంచిని వివరించండి
  • -కార్యకర్తలకు జగన్‌ దిశా నిర్ధేశం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘రానున్న 45 రోజులు మనకు చాలా కీలకం. పూర్తి విశ్వాసంతో పనిచేయండి. ప్రతి ఇంటికి వెళ్లండి. వారికి జరిగిన మంచిని వివరించండి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో మనం చాలా బలంగా ఉన్నాం. దీనిని కొనసాగించాలి.’ అని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. ‘మేము సిద్ధం…మా బూత్‌ సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మంగళగిరిలోని సికె కన్వెన్షన్‌ హాలులో వైసిపి మంగళవారం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ఇచ్చిన చెత్త హామీలు తనకు ఇంకా గుర్తున్నాయని అన్నారు. అలా ఆచరణ సాధ్యంకాని హామీలతో ప్రజల్ని మభ్యపెట్టడం తమ అభిమతం ఎంతమాత్రం కాదని చెప్పారు. 2014లో సాద్యపడని హామీలను ప్రకటించి వాటిని అమలు చేయకుండా మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుండి తొలగించిన ఘనత చంద్రబాబుదన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని చెప్పారు. దేశంలోనే విశ్వసనీయతకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ మారుపేరుగా నిలిచిందన్నారు. అందుకే ఆచరణ సాధ్యంకాని హామీలను ఇవ్వడం లేదన్నారు. 2019లో అమలు చేయగలిగే హామీలను మాత్రమే ఇచ్చామని, అధికారంలోకి రాగానే 99 శాతం హామీలను నెరవేర్చినట్టు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 151 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో విజయం సాధించిందని, ఇపుడు 99శాతం హామీలను అమలు చేయడంతో ప్రజలు తమ వెంటే ఉన్నారని అన్నారు. వైసిపికి ఓటు వేయకపోతే సంక్షేమం ఆగిపోతుందని ప్రజలందరికీ అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాలను యూనిట్‌గా తీసుకుని పనిచేయాలని చెప్పారు. బూత్‌స్థాయిలో ఓటర్లను ఎన్నికలలోపు కనీసం ఐదారుసార్లు కలవాలన్నారు. వలంటీర్లు, గఅహ సారథులతో సమన్వయపరచుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పథకాలతో 87 శాతం పైచిలుకు కుటుంబాలకు సంక్షేమం అందించామని, అదే విషయాన్ని ఒటర్లకు తెలియచేయాలని అన్నారు. లబ్ది పోందిన ప్రతి గడపకు వెళ్లి చేసిన మంచిని ఒట్లుగా మరల్చుకోవాలని, దానికోసం అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.

➡️