భారతదేశ రాజ్యాంగమే ప్రమాదంలో పడింది : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

గన్నవరం (విజయవాడ) : భారతదేశ రాజ్యాంగమే ప్రమాదంలో పడిందని, మోడి ప్రభుత్వాన్ని గద్దె దించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం గన్నవరంలో నిర్వహించిన సిపిఐ(ఎం) ఎన్నికల ప్రచార కార్యక్రమ బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ … ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలపై భారతదేశ పౌరసత్వం ఆధారపడి ఉందని చెప్పారు. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడమే తప్ప ఈ పదేళ్ల కాలంలో మోడి ప్రభుత్వం ఏం చేసిందని చెప్పడం లేదన్నారు. రాష్ట్రంలో సిఎం జగన్‌ నియంత పాలన చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి చేసిన ఏ హామీలను నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు హయాంలో కూడా రాష్ట్రంలో ఏ అభివృద్దీ జరగలేదన్నారు. ఇంతవరకు మోడి చెప్పిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ధరలను పెంచి సామాన్యుల నడ్డిని విరిచారని అన్నారు. అన్ని రంగాల్లోనూ హామీలను నెరవేర్చే విషయంలో, అభివృద్ధి చేసే విషయంలో మోడి విఫలమయ్యారని ధ్వజమెత్తారు. మతాల మధ్య చిచ్చుపెడుతూ, ముస్లింలపై విద్వేషకరమైన ప్రసంగాలు చేస్తున్నారని అన్నారు. నేడు భారతదేశ రాజ్యాంగమే ప్రమాదంలో పడిందన్నారు. మోడి ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు.

➡️