బిజెపితో పొత్తు హేయం

 

రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీతో దోస్తీనా?

నెల్లూరు నగరం నుంచి సిపిఎం పోటీ : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి :రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకోవడం హేయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. బిజెపితో పొత్తు కుదిరి ఎన్‌డిఎలో చేరుతున్నట్లు టిడిపి, జనసేన ప్రకటించాయని, రాష్ట్ర ప్రయోజనం కోసం కలుస్తున్నామని, స్వర్ణయుగం తెస్తామని చెబుతున్నారని అన్నారు. భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తామని చంద్రబాబు చెబుతున్నారని, ఇది లంగుబాటు అని విమర్శించారు. ఈ పొత్తు బిజెపి విద్రోహానికి అధికార ముద్ర వేయడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 2014లో టిడిపి, బిజెపి పొత్తు పెట్టుకున్నాయని, 2014 నుంచి 2019 వరకు ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా హక్కును ఫణంగా పెట్టి, ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఏమీ లేకుండా పదేళ్లు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారన్నారు. రాజధాని కడతామని సింగపూర్‌, జపాన్‌ పేర్లు చెప్పి చివరికి రాజమౌళి సెట్టింగ్‌లతో కాలం గడిపారని విమర్శించారు. పొత్తు ద్వారా రాష్ట్ర ప్రజలను మోసగించడానికి సిద్ధమయ్యారని అన్నారు. లౌకితతత్వం వదిలేసి, మతోన్మాదం వైపు చంద్రబాబు వెళుతున్నారని విమర్శించారు. ఈ పార్టీల పొత్తు టిడిపిలోని ఏ ఒక్క నాయకునికీ ఆమోదం కాదని, ఆ పొత్తు రాష్ట్రాభివృద్ధి కోసం కాదని, కేవలం స్వార్థ రాజకీయాల కోసమేనని వివరించారు. బిజెపి ధృతరాష్ట్ర కౌగిలిలాంటిందని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలు దెబ్బతిన్నాయని తెలిపారు. టిడిపి, జనసేన పార్టీలకు అదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. 2014లో గుజరాత్‌ తరహా అభివృద్ధి చేస్తానని చెప్పారని, 2019లో పుల్వామా ఘటనను ముందుకు తీసుకొచ్చారని, ఇప్పుడు రామమందిరం నినాదంతో ముందుకు వస్తోందని వివరించారు. ఇటీవల చంద్రబాబు జైలుకు వెళ్లడానికి బిజెపి పాత్ర ఉందని, అయితే, తన అరెస్ట్‌కు బిజెపి పాత్ర లేదని ఆయన చెప్పడం విడ్డూరంగా ందని శ్రీనివాసరావు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు తమ హయాంలో 74 శాతం పూర్తి చేశామని చంద్రబాబు చెబుతున్నారని, ఇంతకన్నా మోసం మరొకటి లేదని అన్నారు. అక్కడ జరిగింది కేవలం 22 శాతం పనులు మాత్రమేనని తెలిపారు. దీనిపై చంద్రబాబుతో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. పోలవరం, విశాఖ ఉక్కు పరిశ్రమల గురించి చర్చలు పెట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో బిజెపి, టిడిపి, జనసేన, వైసిపి పార్టీలను తిప్పికొట్టి వామపక్షాలు, కాంగ్రెస్‌లను ఆదరించాలని కోరారు. కాంగ్రెస్‌, వామపక్షాలు అవగాహనతో పోటీ చేస్తాయని, సీట్ల విషయమై చర్చలు సాగుతున్నాయని చెప్పారు. నెల్లూరు నగరం నుంచి సిపిఎం పోటీ చేస్తోందని, త్వరలో అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. విలేకర్ల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, జిల్లా కార్యదర్శివర్గసభ్యులు మాదాల వెంకటేశ్వరు, ఎం.మోహన్‌రావు పాల్గొన్నారు.

➡️