రాజధాని విషయంలో వైసిపి, బిజెపి ముద్దాయిలే

cpm leader ch baburao on amaravati protest 1500days

– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించాలి

– మహిళల పోరాటం స్ఫూర్తిదాయకం

– అమరావతి రైతుల సమర శంఖారావం సభలో వక్తలు

– రాజధానిలో 1500వ రోజు వినూత్న కార్యక్రమాలు

ప్రజాశక్తి – తుళ్లూరు (గుంటూరు జిల్లా) :రాజధాని విషయంలో వైసిపి, బిజెపి రెండూ ముద్దాయిలేనని, ప్రజా కంటక పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలని వెలగపూడిలో జరిగిన సభలో వక్తలు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి మహోద్యమం గురువారం 1500వ రోజుకు చేరిన సందర్భంగా గురువారం ‘అమరావతి రైతుల సమర శంఖారావం’ పేరుతో సభ నిర్వహించారు. రాజధాని గ్రామాల్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. తుళ్లూరులో రైతులు, చిన్నారులు 1500 రోజులను సూచించే ప్లకార్డులు పట్టుకొని జై అమరావతి అంటూ నినదించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ… ఒక మోసగాడు, నయవంచకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా ఉంటుందో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలే అందుకు ఉదాహరణ అని అన్నారు. మూడు రాజధానుల డ్రామాను తుగ్లక్‌ చర్యని ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడే పరిస్థితిలో లేరన్నారు. మూడు నెలల తరువాత వైసిపి ప్రభుత్వం ఉండదని, కొత్త ప్రభుత్వం వస్తుందని, వైసిపి పతనం అమరావతితోనే ప్రారంభమైందని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ.. రాజధాని ఏదో తమకు తెలియదని హైకోర్టులో బిజెపి అఫిడవిట్‌ వేసిందని గుర్తు చేశారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం కూడా జరగలేదని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్‌, కేసుల విషయం కోర్టులు చూస్తాయని, చంద్రబాబు అరెస్ట్‌ వెనుక ఎవరు ఉన్నారో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని అన్నారు. వైసిపి, బిజెపిని గద్దెదించాలని, మోడీతో కలిస్తే వాళ్లు కూడా నిలువునా మునిగిపోతారని చెప్పారు. రైతులు మోడీని కాకుండా పోరాటాన్ని, ఐక్యతను నమ్ముకోవాలని కోరారు. పోరాటం వల్లనే అమరావతి ఉద్యమం నిలిచిందని తెలిపారు. అమరావతి ఉద్యమం రాజకీయ పోరాటంగా మారాలన్నారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ.. అమరావతి ఉద్యమంలో మహిళల పాత్ర మరువలేనిదన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని, అమరావతిని కుట్రలతో, దుర్మార్గంతో నిర్వీర్యం చేస్తున్నారని గ్రహించిన మహిళలు 1500 రోజుల పాటు వీరోచితంగా పోరాడారని చెప్పారు. మహిళలలో ఓర్పుతో పాటు పట్టుదల ఉంటుందని అంగన్‌వాడీలు కూడా పోరాడి ప్రభుత్వం మెడలు వంచారని అన్నారు. అమరావతి జెఎసి నాయకులు పువ్వాడ సుధాకరరావు మాట్లాడుతూ..అమరావతి ఉద్యమానికి కమ్యూనిస్టుల పోరాటాలే స్ఫూర్తి అని అన్నారు. సభకు ముందు అమరావతి ఉద్యమంలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు, మాజీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, కృష్ణా జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌ పర్సన్‌ గద్దె అనూరాధ, అమరావతి జెఎసి నాయకులు స్వరాజ్యరావు, ముస్లిం మైనారిటీ నాయకులు సిబ్లి , జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.

➡️