పాలకుల వైఫల్యాలను వివరిస్తూ సిపిఎం ప్రచారం

Apr 19,2024 09:00 #2024 elections, #candidates, #cpm
  •  విజయాన్ని కాంక్షిస్తూ ముందడుగు

ప్రజాశక్తి-యంత్రాంగం : సిపిఎం అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. డప్పుల దరువులు… మంగళ హారతులు… కుంకుమ తిలకాలు దిద్ది ఎక్కడికక్కడ ప్రజలు స్వాగతం పలికారు. సిపిఎం అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను పలకరిస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుకు ఓట్లు వేయాలని కోరుతున్నారు. సిపిఎం ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ.. బిజెపి, వైసిపి, టిడిపి పాలకుల వైఫల్యాలను వివరిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని సుందరయ్యనగర్‌లో సిపిఎం మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకరరావు విజయాన్ని కాంక్షిస్తూ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కూడళ్లలో జరిగిన సమావేశాల్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించబోమని రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు కేంద్రంతో ప్రకటన చేయించగలవా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోడీ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి రానున్న ఎన్నికల్లో బిజెపి దాని మిత్రులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రచారంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, నాయకులు పి.మురళీకృష్ణ, జయరామ్‌, కె.గడ్డన్న, ఎస్‌.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా కల్లూరులో సిపిఎం పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గౌస్‌ దేశారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపిని, దానికి తొత్తులుగా మారిన వైసిపి, టిడిపిలను ఓడించి ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే కల్లూరును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని సోమాపురం, ఆళ్లగడ్డలో పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అల్లూరి జిల్లా అడ్డతీగల మండల కేంద్రంలో సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్స, రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావు విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎవి.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం పరిధిలో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడును గెలిపించాలని కోరుతూ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. కరపత్రాలు పంపణీ చేస్తూ కమ్యూనిస్టులను చట్టసభలకు పంపిస్తే ప్రజా సమస్యలపై గళమెత్తుతారని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి మండంగి రమణకు మద్దతుగా గరుగుబిల్లి మండలంలోని గరుగుబిల్లి, పెద్దూరు, రావుపల్లి కొత్తపల్లి గ్రామాల్లో ఆ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాచిపెంట మండలం మెట్టవలస, కుడుమూరు, కొత్తవలస తదితర గ్రామాల్లో అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్సకు మద్దతుగా ప్రచారం చేపట్టారు.

నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి మూలం రమేష్‌ నియోజకవర్గం పరిధిలోని 16వ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నిరంతరం పేదలు, కార్మికులు, రైతులు, ప్రజలకు అందుబాటులో ఉండే సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని నాయకులు కోరారు.

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని దావాజీ గూడెం, అజ్జంపూడి, విజయవాడ రూరల్‌ మండలంలోని నున్న గ్రామాల్లో సిపిఎం గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలుసుకొని ఓట్లు అభ్యర్థించారు.

➡️