రంపచోడవరంలో సిపిఎం విస్తృత ప్రచారం

  •  సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి – రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా) : ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు కోరారు. తద్వారా దేశాన్ని రక్షించుకోగలుగుతామన్నారు. రంపచోడవరంలోని ఆ పార్టీ కార్యాలయంలో సిపిఎం తరపున పోటీ చేస్తున్న అరకు పార్లమెంట్‌ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స, రంపచోడవరం శాసనసభ అభ్యర్థి లోతా రామారావు పరిచయ కార్యక్రమం సోమవారం జరిగింది. పార్టీ ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… దేశాన్ని నాశనం చేయడానికి బిజెపి కంకణం కట్టుకుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా విక్రయిస్తోందని తెలిపారు. సహజ వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టడం బిజెపికి అలవాటుగా మారిందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వనరులను పాలకులు దోచుకుం టున్నారని, యువతకు ఉపాధి లేకుండా చేస్తున్నారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పి.అప్పలనర్స మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో విద్య, ఉపాధి, వైద్యం, తాగునీరు వంటి ప్రధాన అంశాలపై కేంద్రీకరించి పని చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. సిపిఎం గెలుపు ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడు తుందన్నారు. లోతా రామారావు మాట్లాడుతూ.. పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో బిజెపి,వైసిపి, టిడిపి పూర్తిగా విఫలమయ్యామని అన్నారు. నిర్వాసితుల కోసం పోరుబాట పట్టింది సిపిఎంనేనని గుర్తు చేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సంవత్సరానికి ఒక గ్రామాన్ని అభివృద్ధి చేసినా ఇప్పటికే ఏజెన్సీలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెంది ఉండేవన్నారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వాణిశ్రీ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు నక్కా బాలశివరామకృష్ణ, మండల కమిటీ సభ్యులు సంతోష్‌ కుమార్‌, ఆదివాసీ సంఘం నాయకులు శ్రీనివాసరెడ్డి, చికిలింత సర్పంచ్‌ కోండ్ల సూరిబాబు పాల్గొన్నారు. పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులకు ఉమ్మడి గోదావరి జిల్లాల శాసన మండలి సభ్యులు ఇళ్ల వెంకటేశ్వరరావు అభినందనలు తెలిపారు.

➡️