భూహక్కు చట్టం రద్దు : ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ డిమాండ్‌

crop damage visit aiks national council meeting

చివరి రోజు ఆరు తీర్మానాలు ఆమోదం

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : 2022 భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. కర్నూలులోని ఎన్‌.శంకరయ్య నగర్‌ వేదికగా గత మూడు రోజులుగా జరిగిన ఈ సమావేశాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు ఆరు తీర్మానాలకు ఆమోదించారు. ఆర్టికల్‌ 370 రద్దును సుప్రీం సమర్థించడం సరైంది కాదని, ఆర్టికల్‌ 370ను కొనసాగించాలని, సమాఖ్య వ్యవస్థను కాపాడాలని, అమెరికా వ్యవసాయ వ్యాపారుల కోసం రైతులకు నష్టం కలిగించే ప్రభుత్వ విధానాలను ఖండించాలని, ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ మిషన్‌ సరైంది కాదని, పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులను ఖండించాలని కౌన్సిల్‌ సమావేశం తీర్మానించింది. ఈ వివరాలను ఎఐకెఎస్‌ అఖిల భారత ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై 26 రాష్ట్రాల ప్రతినిధులు సమావేశాల్లో చర్చించారని తెలిపారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారన్నారు. రైతుల అప్పులు, ఆత్మహత్యలు పెరిగాయని, దేశంలో లక్షమందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగిరాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మోడీ సర్కార్‌ ఉలుకు పలుకు లేదని విమర్శించారు. పైగా విద్యుత్‌ సంస్కరణల పేరుతో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌మీటర్ల విధానం తీసుకొచ్చిందన్నారు. దీనిని ఏ రాష్ట్రమూ అమలు చేయకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తుండడం శోచనీయమన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ రైతు వ్యతిరేక ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని, వాటికి గుణపాఠం నేర్పాలని అన్నారు. ఎఐకెఎస్‌ ఉపాధ్యక్షులు హన్నన్‌ మొల్లా మాట్లాడుతూ రైతుల రుణాలు మాఫీ చేయడం లేదని, అదాని, అంబానీలకు, కేవలం వంద కుటుంబాలకు మాత్రం మోడీ ప్రభుత్వం రూ.50 లక్షల కోట్ల దోచి పెడుతోందన్నారు. కార్పొరేట్లకు ఏజెంట్‌గా మారి విద్వేష రాజకీయాలు నడుపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ‘మోడీ హటావో… దేశ్‌ కి బచావో’ నినాదంతో గ్రామస్థాయి నుండి దేశ స్థాయి వరకు వివిధ రూపాల్లో ప్రచారాలు నిర్వహించి, పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మరో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని తీర్మానించినట్లు తెలిపారు. నష్టపోయిన పంటల పరిశీలనకర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో నష్టపోయిన పత్తి, మిరప పంటలను ఎఐకెఎస్‌ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఎఐకెఎస్‌ అఖిల భారత ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ మాట్లాడుతూ రైతులు ఐక్యమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటాలు సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐకెఎస్‌ ఆర్థిక కార్యదర్శి కృష్ణప్రసాద్‌, ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ పాల్గన్నారు.

➡️