‘ఉక్కు’ భూములు కాజేసేందుకు యత్నం

Feb 11,2024 21:57 #DSC Notification, #Nara Lokesh, #TDP
lokesh

-టిడిపి అధికారంలోకి వస్తే ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్లాంట్‌ను కాపాడుతుంది

-ఏటా డిఎస్‌సి నిర్వహణ

-‘శంఖారావం’లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి:విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించి ఆ భూములను కాజేసేందుకు వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. వచ్చే ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేసేందుకు చేపట్టిన శంఖారావం కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం, పలాస, టెక్కలిలో నిర్వహించిన బహిరంగ సభల్లో లోకేష్‌ ప్రసంగించారు. టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి కాపాడుకుంటుందని, ఉద్యోగుల ఉద్యోగ భద్రత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడుతున్నారని, విశాఖకు ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేకపోయారని, విశాఖలో రూ.500 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్‌ కట్టుకున్నారు తప్ప, చేసిందేమీ లేదని విమర్శించారు. విశాఖలో భూ కబ్జాలకు సహకరించలేదని తహశీల్దార్‌ రమణయ్యను హత్య చేశారని, ఈ సంఘటన రాష్ట్రంలోని పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు. మూతపడిన సుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని గత ఎన్నికల్లో జగన్‌ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో 23 వేల పోస్టులతో డిఎస్‌సి ఇస్తామని వైసిపి హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక 18 వేల పోస్టులే ఖాళీ ఉన్నాయని చెప్పిందని అన్నారు. పాఠశాలల రేషనలైజేషన్‌ పేరుతో పోస్టులు తగ్గించి, ఇప్పుడు నామమాత్రంగా ఆరు వేల పోస్టులతో డిఎస్‌సి నోటిఫికేషన్‌ ఇచ్చి నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారని దుయ్యబట్టారు. టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఏటా డిఎస్‌సి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ పాలనలో విద్యుత్‌ ఛార్జీలు తొమ్మిదిసార్లు పెరిగాయని, ఆర్‌టిసి ఛార్జీలు, ఇంటి పన్ను పెంచారని, చెత్తపై పన్ను విధించారని విమర్శించారు. బ్లూ బటన్‌తో రూ.10 వేసి, రెడ్‌ బటన్‌తో రూ.100 తీసుకుంటున్నారని వివరించారు. టిడిపి హయాంలో అమలు చేసిన వంద సంక్షేమ పథకాలను జగన్‌ రద్దు చేశారని విమర్శించారు. జగన్‌ ప్రతిదానికి సిద్ధం… సిద్ధం… అంటున్నారని, జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా? అని ఎద్దేవా చేశారు. జీడిపిక్కల ధర 2019లో రూ.14 వేలు ఉందని, ఇప్పుడు రూ.ఏడు వేలకు పడిపోయిందని అన్నారు. జీడి రైతులకు మద్దతు ధర ప్రకటిస్తామని, సంక్షోభంలో కూరుకుపోయిన జీడి పరిశ్రమలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పలాసలో మంత్రి అప్పలరాజు కొండలను సైతం మింగేస్తున్నారని, బర్రెల కొనుగోళ్లలో రూ.రెండు వేల కోట్ల ప్రజాధనాన్ని లూఠీ చేశారని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక విచారణ చేసి వడ్డీతో సహా కక్కిస్తామన్నారు. చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్‌ బుక్‌లో రాశామని, తాము అధికారంలోకి వచ్చాక వారిపై జ్యుడీషియల్‌ విచారణ చేపట్టి డిస్మిస్‌ చేయడంతోపాటు జైలుకు పంపుతామని హెచ్చరించారు. సిపిఎస్‌ రద్దు చేయాలని వినతిశంఖారావం యాత్రకు వచ్చిన లోకేష్‌కు సిపిఎస్‌ రద్దు చేయాలని యుటిఎఫ్‌, ఎపి సిపిఎస్‌ఇఎ నాయకులు వినతిపత్రాలు ఇచ్చారు. డిఎస్‌సి 1998 క్వాలీఫై అభ్యర్థులు, ఆర్‌ఎంపిలు, పిఎంపిలు, అగ్రిగోల్డ్‌ బాధితులు, బెంతు ఒరియాలు, మత్స్యకార కండ్ర సామాజిక తరగతి నాయకులు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపి రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు.

➡️