డిఎస్‌సిని వాయిదా వేయాలి : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఉపాధ్యాయ ఎంపిక (డిఎస్‌సి) పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక లేఖ రాశారు. ఈ పరీక్షను మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఆన్‌లైన్‌లో జరపాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందన్నారు. అయితే మార్చి, ఏప్రిల్‌ మధ్య రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారం వల్ల డిఎస్‌సి అభ్యర్థులు అసౌకర్యానికి గురవుతారని, ప్రిపరేషన్‌పై దృష్టి సారించే అవకాశం తక్కువగా ఉంటుందని అన్నారు. ఇప్పటికే సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు (ఎస్‌జిటిలుగా పనిచేసేవారు స్కూల్‌ అసిస్టెంట్‌) కూడా చాలా మంది డిఎస్‌సి పరీక్ష రాస్తున్నారని, వారిలో చాలా మంది పదోతరగతి స్పాట్‌ వాల్యూయేషన్‌, ఎన్నికల విధులకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. దీంతో వారికీ ప్రిపరేషన్‌కు అవకాశం ఉండదన్నారు. ఇటీవలే టెట్‌ జరిగిందని, వెంటనే డిఎస్‌సి పెట్టడం వల్ల ప్రిపరేషన్‌కు సమయం లేదన్నారు.

➡️