‘డ్వాక్రా’ వడ్డీ దోచుకుంటున్న ప్రభుత్వం

cpm v srinivasarao press meet on bjp communal politicsa
  •  జిఓ 2 రద్దు చేయాలి : వి. శ్రీనివాసరావు

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : డ్వాక్రా మహిళలు కష్టపడి చేస్తున్న పొదుపు వడ్డీని రాష్ట్ర ప్రభుత్వందోచుకుంటోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంఓ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. సీతారాంతో కలిసి మాట్లాడిన ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణం ప్రభుత్వమే ఇయ్యవచ్చని చెప్పారు. డ్వాక్రా సంఘాల్లో కోటిమంది మహిళలు ఉంటే 79 లక్షల మందికి ఆసరా ఇచ్చారని తెలిపారు. వారి డబ్బులు రూ.18 వేల కోట్లు డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లో ఉన్నాయని, వాటికి రూపాయి చొప్పున వడ్డీ ఇచ్చినా రూ.3 వేల కోట్లు వస్తాయని, ప్రభుత్వం రద్దుచేసిన వడ్డీ రూ.1300 కోట్లని చెప్పారు. ఈ లెక్కలు పరిశీలిస్తే డ్వాక్రా మహిళలే ప్రభుత్వానికి వడ్డీ ఇస్తున్నట్లు అర్ధమవుతుందని చెప్పారు. దానిలో కొంతభాగాన్ని మహిళలకు ఇచ్చి దాన్నే ఆసరాగా చెప్పడం మహిళలను మోసం చేయడమేనని అన్నారు. అసలు ప్రభుత్వం వడ్డీలేని రుణాలే ఇవ్వొచ్చని, అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. దీనికితోడు బ్యాంకర్లు కూడా ప్రాసెస్‌ పేరుతో వందల కోట్లు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై సిఎం నోరెతత్తడం లేదని తెలిపారు.

అంగన్‌వాడీల సమ్మె నేపథ్యంలో ఫ్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని కోరారు. జిఓ నెంబరు 2ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అది అలాగే ఉంచితే రాబోయే రోజుల్లో పోరాడే ప్రజల మెడపై కత్తిలా ఎదురవుతుందని తెలిపారు.

ఠాకూర్‌, అంబేద్కర్‌ పేరుతో పేదల అణచివేత

భారతరత్న బిరుదు ఇవ్వడం ద్వారా కర్పూరీ ఠాకూర్‌ను అడ్డుపెట్టుకుని దేశంలో బిసిలను, రాష్ట్రంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి దళితులు, మైనార్టీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేస్తున్నాయని పేర్కొన్నారు. సోషలిస్టయిన కర్పూరిఠాకూర్‌ బీహార్లో మద్య నిషేధాన్ని అమలు చేస్తే ఆయనకు భారతరత్న బిరుదు ఇచ్చినరోజే బిజెపి పాలిత గుజరాత్‌లో మద్య నిషేధాన్ని ఎత్తేశారని తెలిపారు. సోషలిస్టు భావాలు కలిగిన ఠాకూర్‌కు భారతరత్న ఇచ్చి కులగణన చేయకుండా సామాజిక న్యాయానికి గండి కొడుతున్నారు. రాష్ట్రంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టి ఆయన ఆశయాలు అయిన కుల నిర్మూలన, రిజర్వేషన్లను తుంగలో తొక్కుతున్నానరని, ఇదేనా వారికి అర్పించే నివాళని ప్రశ్నించారు.

బిసి యుతను మోసం చేస్తున్న కేంద్రం

బిసిల కోసం పెట్టిన విశ్వకర్మ కౌశల్‌ యోజన పథకం కింద 2.50 లక్షల దరఖాస్తులు మాత్రమే తీసుకుంటామని షరతు పెట్టారని, వాస్తవంగా దీనికి అర్హులైన బిసి యువత 50 లక్షల మంది ఉన్నారని వివరించారు. పెట్టుకున్నవారిలో అర్హులకు మూడు లక్షల రుణం ఇచ్చి ఐదుశాతం వడ్డీ కట్టించుకుంటున్నారని పేర్కొన్నారు. అంటే అధిక వడ్డీ వసూలు చేసి బిసిలను నిలువునా మోసం చేయడానికి మోడీ, బిజెపి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. సోషల్‌ ఇంజనీరింగ్‌ పేరుతో చేస్తున్న ఇటువంటి కుట్రలను శ్రీనివాసరావు ఖండించారు.

ఉద్యమాలను అణచే రాజకీయ సాధనంగా పోలీసులు

ఆసరా పేరుతో సిఎం అనంతపురం వెళ్లిన సమయంలో సిపిఎం, సిఐటియు, అంగన్‌వాడీలు, ఇతర వామపక్ష నాయకులను అరెస్టు చేశరాని అన్నారు. పోలీసులు ప్రతిపక్ష పార్టీలను, ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు రాజకీయ సాధనంగా మారిపోతున్నారని విమర్శించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను సభలు పెట్టుకోనీయడం లేదని, అధికారపక్షం ఎక్కడ ఎప్పుడు ఎలా కావాలంటే అలా పెట్టుకునేందుకు అనుమతిస్తున్నారని తెలిపారు. రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇలా ఏకపక్ష నిర్ణ యాలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకుని ఈ రెండు నెలలు యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్‌ చేతుల్లోకి తీసుకోవాలని అన్నారు.

ప్రజలు బాధల్లో ఉన్నారు

సిఎం స్టార్‌ క్యాంపెయినర్లు ప్రజలేనని చెబుతున్నారని, కానీ వారే స్టోరీ రివోల్టర్స్‌ అవుతున్నారని, ప్రభుత్వం మోపుతున్న భారాలనూ వ్యతిరేకించడంలోనూ ప్రజలే స్టార్లని అన్నారు. ఇదే అంశంపై వారు రాష్ట్రంలో ప్రచారం చేస్తారని, ఆ విషయాన్ని కూడా సిఎం మర్చిపోకూడదని పేర్కొన్నారు.

స్పీకర్‌కు ప్రజాస్వామ్య విలువలు లేవు

ఎమ్మెల్యే గంటా రాజీనామాను ఆమోదించడంలో స్పీకర్‌ కనీస విలువలు పాటించలేదని, రాజకీయ ఆలోచనల ప్రకారం ఆమోదించారని, ఈ విషయంలో ఆయన ప్రజాస్వామ్య విలువలు పాటించలేదని మండిపడ్డారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో గెలవలేమనే పేరుతో మూడేళ్ల క్రితం చేసిన రాజీనామాను సభ్యుడి అభిప్రాయం కోరకుండా ఇప్పుడు ఆమోదించారని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఒత్తిడి చేసినా చట్టం ప్రకారం వ్యవహరించాలని, సభ్యుడి అభిప్రాయం తీసుకోవాలని, స్పీకర్‌ అనుసరించింది అనైతిక పద్ధతని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పేర్కొన్నారు.

సెక్యులర్‌ పార్టీలతో సంప్రదింపులు

బిజెపికి రాష్ట్రంలో చోటు లేకుండా చేయడం సిపిఎం ప్రధాన కర్తవ్యమని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన బిజెపికి చోటు ఇస్తున్నాయని, వారితో కలిసే ప్రసక్తే లేదని అన్నారు. బిజెపికి వ్యతిరేకంగా కలిసివచ్చే సెక్యులర్‌ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇండియా వేదిక లేదని, కేంద్రంలో మాత్రమే ఉందని, వేదికలో లేని అనేక పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయని వివరించారు. సిపిఐతో సంప్రదింపులు చేస్తున్నామని, బిజెపి వ్యతిరేక లౌకిక పార్టీలతో సంప్రదింపులు చేస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

➡️