ట్రిపుల్‌ ”సి”తో ఇసి నిఘా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :మే13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసే అన్ని అంశాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ( త్రిబుల్‌ ”సి”) పేరుతో ఈ వ్యవస్థ పనిచేస్తోంది. సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనా స్వయంగా దీనిని పర్యవేక్షిస్తున్నారు. అంతర్‌రాష్ట్ర సరిహద్దులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 424 చెక్‌పోస్టుల్లో సుమారు 358 చెక్‌పోస్టులు (84.4శాతం) నుంచి వెళ్లే వాహనాల కదలికలను వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఈ కేంద్రం నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఫలితంగా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మొత్తంలోరూ.141కోట్ల విలువకు పైబడి నగదు తదితరాలను జప్తు చేయగలిగినట్టు సిఇఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఎన్నికల నిర్వహణకు ముందే ఇంత పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం అనేది రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఒక రికార్డుగా ఎన్నికల కమిషన్‌ పేర్కొంటోంది. వీటితో పాటు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని మద్యం తయారీ సంస్థల గౌడౌన్ల ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లలో ఏర్పాటు చేసిన వెబ్‌కెమెరాల ద్వారా, తయారీ సంస్థల నుంచి గోదాములు, షాపులు, బార్లకు , ఇతర సంస్థలకు మద్యం సరఫరా చేస్తున్న వాహనాలకు జిపిఎస్‌ ట్రాకింగ్‌ కేంద్రం ద్వారా ఎన్నికల కమిషన్‌ కార్యాలయం పర్యవేక్షిస్తోంది. క్షేత్ర స్దాయిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పరచేందుకు ప్ల్ల్తెయింగ్‌ స్క్వాఢ్‌ బృందాలు, సెక్టోరల్‌ అధికారులు వినియోగించే 1680 వాహనాలు, ఇవిఎంల రవాణాకు వినియోగించే డిజిటి వాహనాల కదలికలను జిపిఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా కూడా పర్యవేక్షిస్తున్నారు.
మీడియా కథనాలపై ఇద్దరు ఎఎస్‌ఓల పర్యవేక్షణ:
మీడియాలో వస్తున్న ఎన్నికల ప్రతికూల వార్తలపై మానిటరింగ్‌ చేసేందుకు ఇద్దరు ఎఎస్‌ఓలతో పాటు 25మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, షిప్టుల వారీగా పనిచేస్తున్నారని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ప్రతికూల వార్తలకు సంబంధించి ఆయా అధికారులనుంచి వివరణ తీసుకోవడం , అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటునన్నట్లు తెలిపింది.

➡️