ముస్లిం రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం

May 10,2024 23:01 #Chandrababu Naidu, #speech

– అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం
– పోలీసులకు వారంలో రెండు రోజులు సెలవు
– పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చి న్యాయం చేస్తాం
– ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు
ప్రజాశక్తి – యంత్రాంగం :ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ జగన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రిజర్వేషన్లు రద్దు చేయడం జరగదని, అవసరమైతే న్యాయస్థానాల్లో పోరాడి రిజర్వేషన్లు కాపాడతామని టిడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి, ఏలూరు, కఅష్ణా జిల్లా గన్నవరం, ఒంగోలులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. మాచర్లలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నాయకులతో మాట్లాడారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు జగన్‌ చేసిందేమీ లేదని, రంజాన్‌ తోఫా, దుల్హన్‌, విదేశీ విద్య రద్దు చేశారని విమర్శించారు. షాదీఖానాల ఏర్పాటు, మసీదులకు ఆర్థిక సాయం, ఉర్దూను రెండో భాషగా చేయడం, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు వంటివన్నీ టిడిపి హయాంలోనే జరిగాయని చెప్పారు. మక్కా యాత్రకు వెళ్లేవారికి రూ.లక్ష ఆర్థిక సాయం, రూ.ఐదు లక్షలు వడ్డీ లేని రుణాలిస్తామని చెప్పారు. జగన్‌వి చీకటి రాజకీయాలని, జగన్‌ పొత్తు కేసుల మాఫీ కోసమైతే, మా పొత్తు రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావడం కోసమన్నారు. పోలవరం నిర్వాసితులందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చి అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు, పెండింగ్‌ డిఎ, టిఎ, జిఎపిఎఫ్‌ సాధ్యమైనంత త్వరలో ఇస్తామని, మెరుగైన పిఆర్‌సి, అప్పటి వరకూ ఐఆర్‌, తక్కువ ధరకే ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టణ వాసులకు రెండు సెంట్ల స్థలం, ఉచితంగా టిడ్కో ఇళ్లు అందిస్తామని ప్రకటించారు. పోలీసులు సరెండర్‌ లీవ్‌లను సొమ్ముచేసుకునే అవకాశం ఇస్తామని, శని, ఆదివారాలు వీక్లీఆఫ్‌ ఇచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. హోంగార్డులకు రూ.18 వేలు వేతనం తామే చేశానని, అధికారంలోకి వచ్చాక రూ25 వేలకు పెంచుతామన్నారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు, పొదుపు సంఘాల యానిమేటర్లకు ఉద్యోగ భద్రత, గోపాలమిత్ర, ఆరోగ్యమిత్ర, బీమా మిత్రలకు న్యాయం చేస్తామని చెప్పారు. జూనియర్‌ డాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు. వందరోజుల్లో గంజాయి మాఫీయాను ఉక్కుపాదంతో అణిచివేస్తామని, ఈ నెల 13న వేసే ఓటుతో తాడేపల్లి ప్యాలెస్‌ బద్దలు కావాలని కోరారు. మీ భూమి మీకు కావాలంటే కూటమి అధికారంలోకి రావాలన్నారు. ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలన్నదే మూడు జెండాల ఎజెండా అని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం వస్తే వరుణుడు కరుణించారని, జోరు వాన కురుస్తున్న లెక్కచేయకుండా ఆడబిడ్డలు రావడం చూసి ఎంతో ఆనందంగా ఉందన్నారు. పోలవరం కాలువను తాను తవ్విస్తే.. కాలవ గట్టుపై ఉన్న మట్టి మొత్తం అమ్మేశారని, అదేమని ప్రశ్నిస్తే టిడిపి కార్యాలయాన్ని వల్లభనేని వంశీ తగలపెట్టించారని, సాక్షి గుమస్తా సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు ప్రభుత్వానికి సలహాదారు అయ్యారని, అతను చెప్పినట్టుగానే రాష్ట్రంలో ప్రజా సంపదను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్ధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️