అల్లూరి స్ఫూర్తితో పోరాటాలు

May 8,2024 00:45 #cpm v srinivasarao, #speech

-అటవీ సంపదను కొల్లగొట్టేవారిని తరిమికొట్టండి
-సిపిఎం అభ్యర్థులను గెలిపించండి : వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి- దేవీపట్నం, రంపచోడవరం, మారేడుమిల్లి విలేకరులు (అల్లూరి జిల్లా)
‘అటవీ సంపదను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రలు చేస్తోంది. ఈ నేపథ్యంలో నాడు బ్రిటీష్‌ వారిని తరిమికొట్టిన అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని ఆదివాసీలు, ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలి. సహజ వనరులను దోచుకునేవారిని తరిమికొట్టాలి’ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్థంతిని పురస్కరించుకుని అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరిపేట, రంపచోడవరం నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గిరిజనుల హక్కులను హరిస్తున్న బ్రిటీషర్లను నాడు అల్లూరి ఎలా తరిమి కొట్టాడో వివరించారు. ఆదివాసీలనే వీరులుగా తీర్చిదిద్ది బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులపై దండెత్తారని వివరించారు. భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి మహోజ్వల శక్తి అని, ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్రోద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమని తెలిపారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, ఆదివాసీలతో, పరిమిత వనరులతో రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యాన్ని ఢకొీట్టాడన్నారు. నేడు బిజెపి పాలనలో దారుణ పరిస్థితులు ఏజెన్సీలో నెలకొన్నాయని, మోడీ ప్రభుత్వం తెల్లదొరల మాదిరిగానే గిరిజనుల హక్కులను కాలరాస్తోందని వివరించారు. విలువైన ఖనిజ సంపదను, అటవీ భూములను అదానీ, అంబానీలకు కట్టబెట్టాలని చూస్తోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో అల్లూరి స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని, ఆదివాసీల తరఫున పోరాడుతున్న, ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్స, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావులను గెలిపించాలని కోరారు. సిపిఎం గెలుపుతోనే గిరిజన హక్కులు, చట్టాల రక్షణ సాధ్యమన్నారు. అల్లూరికి నివాళ్లర్పించిన వారిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, నాయకులు ఎం.వాణిశ్రీ, పిల్లి రామకృష్ణ తదితరులు ఉన్నారు.
‘ఉపాధి’ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వి.శ్రీనివాసరావు అన్నారు. దేవీపట్నం మండలం ఉప్పయ్యపాలెం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కార్మికులను పని ప్రదేశంలో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే క్రమంలోనే కేంద్రం బడ్జెట్‌లో నిధులను తగ్గిస్తోందని తెలిపారు. ఆ చట్టాన్ని తెచ్చేందుకు వామపక్షాలు చేసిన కృషిని వివరించారు. మోడీ హయాంలో జిఒ 3 రద్దు, 1/70 చట్టం నిర్వీర్యంతో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. మారేడుమిల్లి మండలం వేటుకూరు పంచాయతీ భీమవరం గ్రామంలో సర్పంచ్‌ ఈతపల్లి మల్లేశ్వరి సహా పలువురు గిరిజన మహిళలు శ్రీనివాసరావుకు హారతులిచ్చి, పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బిజెపి, టిడిపి, వైసిపిలను ఏజెన్సీలో ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సభకు ఈతపల్లి సత్యనారాయణరెడ్డి అధ్యక్షత వహించారు.

➡️