ఓఎన్జిసి పైప్ లైన్ పనులు అడ్డుకున్న మత్స్యకారులు

Mar 1,2024 17:22 #fishermen, #Kakinada, #Protest
Fishermen who blocked ONGC pipeline works
  • తాళ్లరేవు, బైరవపాలెం, ఇతర మత్స్యకార ప్రాంతాలకు ఇస్తున్న విధంగానే తమకూ పరిహారం ఇవ్వాలని డిమాండ్
    మద్దతు ప్రకటించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

ప్రజాశక్తి-కాకినాడ : తాళ్లరేవు బైరవపాలెం తదితర మత్స్యకార ప్రాంతాలలో మత్స్యకారులకు ఇస్తున్న పరిహారం తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాకినాడ నగరంతోపాటు పరిసర గ్రామాలకు చెందిన మత్స్యకారులు పోర్టు ఏరియాలో జరుగుతున్న ఓఎన్జిసి రిలయన్స్ పైప్లైన్ తదితర కార్యకలాపాలను శుక్రవారం అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకొని మత్స్యకారులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ కాకినాడ నగరంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఓఎన్జిసి రిలయన్స్ రిగ్గుల కార్యకలాపాలు జరిగే ప్రాంతంలో వేట నిషేధం వల్ల ఉపాధి కోల్పోతున్నారన్నారు. ఈ విషయంపై 2009 నుండి కూడా మత్స్యకారులకు నష్టపరిహారం ఇవ్వాలని పోరాడుతూనే ఉన్న మత్స్యకారులకు న్యాయం జరగడం లేదన్నారు. సముద్రంలో ఓఎన్జిసి రిలయన్స్ రిగ్గు లకు సంబంధించిన కార్యకలాపాలకు అన్ని సౌకర్యాలను కాకినాడ నగరం నుండి పొందుతున్నారన్నారు. అయినప్పటికీ ఓ ఎన్ జి సి రిలయన్స్ యాజమాన్యాలు మత్స్యకారులకు న్యాయం చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. రెండు మూడు రోజుల్లో మరలా ఒకసారి ఓఎన్జిసి రిలయన్స్ అధికారులను ప్రతినిధులను కలిసి వినతి పత్రం సమర్పించి కాకినాడ నగరం తో పాటు పరిసర గ్రామాలకు చెందిన మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించాలని వినతిపత్రం ఇచ్చే విజ్ఞప్తి చేయడం జరుగుతుందన్నారు. నష్టపరిహారం చెల్లించే వరకు కూడా ఓఎన్జిసి కార్యకలాపాలను ముందుకు సాగనివ్వమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర పరిసర ప్రాంతాలకు చెందిన మత్స్యకార పెద్దలతోపాటు వేల సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు.

➡️