బిజెపితో ప్రజాస్వామ్యానికి ప్రమాదం : సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి, మాజీ ఎంపి పి.మధు

Apr 24,2024 08:51 #Democracy, #Krishna district, #P Madhu
  • ఉత్సాహంగా గన్నవరం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు నామినేషన్‌

ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : బిజెపి మేనిఫెస్టోలో ప్రజా సమస్యల ప్రస్తావన లేదని, ఒకే దేశం ఒకే నాయకుడు అంటూ మోడీ స్తోత్రంతో మేనిఫెస్టో నిండిపోయిందని సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి, మాజీ ఎంపి పి.మధు అన్నారు. బిజెపి మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తొలుత గన్నవరంలోని చింతపల్లి పాపారావు భవన్‌ (సిపిఎం కార్యాలయం) వద్ద జరిగిన సభలో మధు మాట్లాడుతూ.. రాజస్థాన్‌ ఎన్నికల సభలో ఎన్నికల నియమావళి, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా మతాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ధరలు తగ్గిస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మోడీ తుంగలో తొక్కారన్నారు. జిఎస్‌టి పేరుతో ప్రజలపై భారాలు వేయడంతో ధరలు ఆకాశాన్నంటా యన్నారు. ఈ సమస్యలు చర్చకు రాకుండా పక్కదారిపట్టించి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బిజెపి పూను కుందని విమ ర్శించారు. మతో న్మాద బిజెపితో పొత్తుపెట్టుకున్న టిడిపి, జనసేనను, రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న వైసిపిని ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు వింతా సంజీవరెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బిజెపి పాలనలో దేశంలో ఎటువంటి అభివృద్ధీ జరగలేదని వివరించారు. రాష్ట్రంలో జగన్‌, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లలో ఎవరికి ఓటేసినా అది బిజెపికి వేసినట్లే అవుతుందని తెలిపారు. సిపిఐ కృష్ణా జిల్లా కార్యదర్శి టి.తాతయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని, ప్రజల ఆస్తులను కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. బిజెపిని ఎదుర్కొనే సత్తా కమ్యూనిస్టులకే ఉందని తెలిపారు.


సిపిఎం కృష్ణా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.వి.లక్ష్మణ స్వామి అధ్యక్షతన జరిగిన సభలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, వి.ఉమా మహేశ్వరరావు, రాష్ట్ర నాయకులు కాట్రగడ్డ స్వరూపరాణి, కృష్ణా జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు, కాంగ్రెస్‌ పార్టీ మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి గొల్లు కృష్ణ తదితరులు సభలో ప్రసంగించారు.

కోలాహలంగా ర్యాలీ
కళ్లం వెంకటేశ్వరరావు నామినేషన్‌ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. చింతపల్లి పాపారావు భవనం వద్ద ప్రారంభమైన ర్యాలీ గాంధీ బొమ్మ సెంటర్‌, శాంతి థియేటర్‌ సెంటర్‌, బస్టాండ్‌ సెంటర్‌ వరకు సాగింది. అక్కడ నుంచి అప్సర సెంటర్‌ మీదుగా ఎన్‌టిఆర్‌ బొమ్మ సెంటర్‌కు చేరింది. డప్పు కళాకారులు తమ విన్యాసాలతో సందడి చేశారు.

➡️