ఇళ్ల వద్దకే పింఛన్లు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి

Apr 24,2024 23:16 #chandrababu, #speech, #srikakulam

కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో పింఛన్లను ఇళ్ల వద్దనే పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కోరారు. ఈ మేరకు బుధవారం రాసిన లేఖలో గ్రామస్థాయి ఉద్యోగుల ద్వారా మే 1వ తేది ఇంటివద్దే పంపిణీ చేసేలా రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెలిపారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందున ఇంటింటికీ పెన్షన్‌ పంపిణీని రెండు రోజుల్లో పూర్తిచేసే అవకాశం ఉందని సూచించారు. ఇంటివద్దనే పెన్షన్‌ పంపిణీ జరుగుతుందన్న సమాచారాన్ని లబ్దిదారులకు చేరవేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వానికి తగు ఆదేశాలు ఇచ్చి అమలు అయ్యేలా చూడాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ అందించడం సాధ్యమవుతుందని కలెక్టర్లు ఇదివరకే చెప్పారని తెలిపారు. వాలంటీర్లు లేని రాష్ట్రాల్లో కూడా ఇంటింటికీ పంపిణీ జరుగుతుందని గతంలో హైకోర్టు కూడా వ్యాఖ్యానించిందని పేర్కొన్నారు. ఇంటివద్దే అందించాలని గతంలో తాము చేసిన విన్నపాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టిందని పేర్కొన్నారు. మార్చి నెలకు సంబంధించిన పెన్షన్‌ నగదు ఈ నెల 1వ తేదిన రావాల్సి ఉన్నా 3వ తేదీ వరకు ప్రభుత్వం విడుదల చేయలేదని వివరించారు. మూడు రోజుల పాటు సచివాలయాల చుట్టూ తిరిగి ఎండదెబ్బకు 33 మంది వృద్ధులు మరణించారని తెలిపారు. రాజకీయ లబ్ధికోసం ప్రభుత్వం వారి మరణాలను ప్రతిపక్ష పార్టీలకు ఆపాదించిందని తెలిపారు.

➡️