పోరాట నాయకులకు అవకాశమివ్వండి

  • సిపిఎం నేతల ఇంటింటి ప్రచారం

ప్రజాశక్తి-యంత్రాంగం : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకులకు ఈ ఎన్నికల్లో ప్రజలు మద్దతు పలికి గెలిపించాలని కోరుతూ సిపిఎం నేతలు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఎం నేతల లక్ష్యమని తెలిపారు. దేశ సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు అప్పనంగా దోచిపెడుతున్న బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు నిరంతరం పోరాడతాయని కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని, దానికి మద్దతు తెలుపుతున్న టిడిపి, జనసేన పార్టీలను, రాష్ట్రంలో మోడీ విధానాలను అమలు చేస్తున్న వైసిపిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ 29వ డివిజన్‌లోని మధురానగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ అవినీతిపరులు, కబ్జాకోరులైన నాయకుల నుండి విజయవాడను కాపాడాలన్నారు. అభివృద్ధిని విస్మరించి, అవినీతిపై దష్టి పెట్టిన నేతలను తిరస్కరించాలని కోరారు. ఫిరాయింపుదారులతో నిండిపోయిన బిజెపి, వైసిపి, టిడిపిలను ఓడించాలన్నారు. విజయవాడను, మధురానగర్‌ ప్రాంతాన్ని తిరోగమంలో నెట్టిన నేతలకు బుద్ధి చెప్పాలని, ఇండియా వేదిక బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌లోని నున్న గ్రామంలో గన్నవరం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు విస్త ృత ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజా నాట్యమండలి రాష్ట్ర నాయకులు రంగారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు. నిరుద్యోగం పెరిగిందని, ప్రజల ఆకలి బాధలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపికి వైసిపి, టిడిపిలు ఊడిగం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

నెల్లూరు నగరంలోని కోటమిట్ట ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థి మూలం రమేష్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ గతంలో సిపిఎం చేసిన పోరాటాలు, ఉద్యమాలు, సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం సాగించారు. నగర నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న తనను మద్దతిచ్చి గెలిపించాలని కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బిజెపి కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

విశాఖలోని జివిఎంసి 67వ వార్డు గణేష్‌నగర్‌, పెంటయ్యనగర్‌, సాయిరాంనగర్‌, జోగవానిపాలెం తదితర ప్రాంతాల్లో గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు ఇంటింటా కరపత్రాలను పంచుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్సను గెలిపించాలని కోరుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగుడ మండలం కూనపుట్టు, పంచాయతీ బుడ్డపుట్టు, జాముగుడ, హుకుపేంట మండలం భీమవరం ప్రాంతాల్లో సిపిఎం నేతలు ప్రచారం చేశారు.

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని బాసంగి, సంధిగూడ, కె.శివడ, ఎస్‌కె పాడు, కొమరాడ మండలంలోని పాలెంలో కురుపాం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మండంగి రమణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

➡️