సార్వజనీన వైద్యంతోనే ఆరోగ్య భద్రత

Apr 28,2024 20:50 #universal medicine

– ఐఎంఎ హాలు ప్రారంభంలో జాతీయ అధ్యక్షులు అశోకన్‌
– ఆరోగ్య ప్రణాళిక ప్రమాణ పత్రం విడుదల
ప్రజాశక్తి-విజయనగరం కోట :సార్వజనీన వైద్యంతోనే అందరికీ ఆరోగ్య భద్రత సాధ్యమవుతుందని ఐఎంఎ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ ఆర్‌వి ఆశోకన్‌ అన్నారు. విజయనగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహం సమీపంలో నూతనంగా నిర్మించిన డాక్టర్‌ ఆశా సుబ్బారావు ఐఎంఎ హాలును ఆదివారం ఆయన ప్రారంభించారు. ముందుగా ఐఎంఎ రూపొందించిన ఆరోగ్య ప్రణాళిక పత్రాన్ని విడుదల చేశారు. అనంతరం అశోకన్‌ మాట్లాడుతూ.. ఐఎంఎ పోరాటం తరువాత రాజస్థాన్‌లో ఆరోగ్య భద్రత హక్కు సాధ్యమవుతుందని నమ్ముతున్నామని అన్నారు. సరైన వైద్యంతో పాటు రక్షిత తాగునీరు, పరిసరాల పరిశుభ్రత అవసరమని తెలిపారు. ప్రజలందరికీ ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి వైద్యానికి తగిన కనీస వైద్య ప్యాకేజీకి సాధికారత కల్పించాలని కోరారు. సార్వజనీన ఆరోగ్య రక్షణకు ప్రాథమికంగా ప్రభుత్వ రంగం ద్వారా హామీ ఇస్తూ ప్రయివేటు రంగం నుండి వ్యూహాత్మకంగా వైద్య సేవలను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. సొంత చెల్లింపులతో చేసుకొనే ఆరోగ్య బీమా వల్ల అరకొర సేవలు మాత్రమే లభిస్తాయని తెలిపారు. ప్రభుత్వ రెవెన్యూ ఆదాయం ఆరోగ్య నిధులకు మూలంగా ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆరోగ్యానికి సగటున జిడిపిలో 1.1 శాతం నుండి 1.6 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నాయన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువని తెలిపారు. తాగునీరు, పారిశుధ్యానికి విడివిడిగా నిధులు కేటాయిస్తూ ప్రత్యేకంగా వైద్య ఆరోగ్యాలకు 2.5శాతం నిధులు తక్షణం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. దీన్ని క్రమంగా 5.5 శాతానికి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే సామాన్యుడు వైద్యానికి 63 శాతం ఖర్చు చేస్తున్నారని, దీనివల్ల సరాసరి 5.5 కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువకు చేరుతున్నారని అన్నారు. మందులపై 18 శాతం జిఎస్‌టిని తక్షణం తొలగించి ప్రజలకు ఆర్థిక వెసులుబాటును కల్పించాలని కోరారు. డాక్టర్లపై దాడులకు రక్షణగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 11/2008 చట్టాన్ని తీసుకొచ్చారని, దానికి అనుగుణంగానే కేంద్రంలో కూడా ఇటువంటి చట్టాలు తీసుకొస్తే డాక్టర్లపై దాడులను నియంత్రించవచ్చని అన్నారు. ప్రయివేట్‌ ఆస్పత్రుల నియంత్రణకు అక్రిడిటేషన్‌ విధానం మంచిదన్నారు. కార్యక్రమంలో ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ జెసి నాయుడు, జనరల్‌ సెక్రెటరీ డాక్టర్‌ ఫణిందర్‌, రాష్ట్ర ఐఎంఎ ఫైనాన్స్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎం.రవీంద్రనాథ్‌, రాష్ట్ర ఐఎంఎ మాజీ అధ్యక్షులు డాక్టర్‌ జి రవికృష్ణ, 2025- 26 సంవత్సరానికి ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ జి.నందకిశోర్‌, ఐఎం ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ విఎస్‌ ప్రసాద్‌, ఛారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ పి గోపాల్‌రావు, ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఐఎఎఎ సెక్రెటరీ డాక్టర్‌ వి. మృత్యుంజయరావు, డాక్టర్‌ కె.త్రినాథరావు, ఐఎంఎ సభ్యులు పాల్గొన్నారు.

➡️