‘సాక్షి’లో నాకూ సమాన వాటా

Jan 30,2024 08:05 #ap cm jagan, #Comments, #ys sharmila
  • నా పత్రికల్లో నాపై తప్పుడు రాతలు : షర్మిల

ప్రజాశక్తి – కడప ప్రతినిధి/వేంపల్లె : సాక్షిలో తనకు సమాన వాటా ఉందని నా తండ్రి రాజశేఖర్‌రెడ్డి చెప్పారని పిసిసి ఛీప్‌ షర్మిల తెలిపారు. తన పత్రికలో తనపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నాయకులు ఏం రాసినా, ఏం చేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ఉమ్మడి కడప, కర్నూలులో జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు సోమవారం ఆమె నిర్వహించారు. షర్మిల మాట్లాడుతూ.. బిజెపి ఓ మతతత్వ పార్టీ, మతాల మధ్య చిచ్చు పెట్టి చలికాచుకోవడమే బిజెపికి తెలుసు అని మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వంలో ముస్లిములకు, క్రైస్తవులకు భద్రత లేదని తెలిపారు. ప్రత్యేకహోదా కోసమే పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారని, అధికారంలోకి వచ్చాక హోదా కోసం పోరాటం చేస్తే కేసులు పెట్టారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్‌ హోదా కోసం నిరాహార దీక్ష చేశారని, సిఎం అయ్యాక ఒక్కరోజైనా హోదా కోసం పోరాటం చేశారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు స్పెషల్‌ ప్యాకేజీ, పోలవరం, రాజధాని, రైల్వేజోన్‌, కడప-బెంగళూరు రైల్వేలైన్‌, కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణ హామీలను రాబట్టుకోవడంలో విఫలమయ్యాయని విమర్శించారు. బిజెపితో దోస్తీ చేసి ఏమి సాధించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలనకు జగన్‌ పాలనకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ప్రభుత్వ పాలసీలపై మాట్లాడుతున్న తనపై సోషల్‌ మీడియా జోకర్లు వ్యక్తిగతంగా దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో గాయత్రి హాస్పిటల్‌ అధినేత జిలానీ బాషా, వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గానికి చెందిన రాజకీయ నాయకులు విజయజ్యోతి సహ పలువురికి కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి షర్మిల స్వాగతం పలికారు. ఖాజీపేటలో మాజీమంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డిని కలిసి చర్చలు జరిపారు. సిడబ్ల్యుసి సభ్యులు రఘువీరారెడ్డి, ఎపిసిసి మాజీ అధ్యక్షులు సాకే శైలజానాథ్‌, మాజీ మంత్రులు మూలింటి మారెప్ప, అహ్మదుల్లా, మాజీ ఎమ్మెల్యే కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

షర్మిలతో సునీత భేటీ

ఇడుపులపాయలో బస చేసిన పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిలతో మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్‌.సునీత భేటీ అయ్యారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా ఇడుపులపాయకు చేరుకొని తన సోదరి షర్మిలను కలిశారు. అనంతరం వైఎస్‌ఆర్‌కు షర్మిల, సునీత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నివాళులర్పించారు. సుమారు రెండుగంటలపాటు షర్మిలతో సునీత భేటీ అయ్యారు. సునీత కాంగ్రెస్‌లో చేరుతారనే చర్చ సాగుతోంది.

➡️