ట్రిపుల్‌ ఐటి వసతి గృహంలోకి కొండచిలువ

Nov 16,2023 15:45 #Hostels, #IIIT, #Snake
Idupulapaya-TripleIT-Hostel-rioted-by-python

ప్రజాశక్తి – వేంపల్లె (వైఎస్‌ఆర్‌జిల్లా) : వైఎస్‌ఆర్‌ జిల్లా వేంపల్లె మండలంలోని ఆర్‌జెయుకెటి పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటి వసతి గృహంలోకి కొండచిలువ ప్రవేశించింది. దీంతో, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ట్రిపుల్‌ఐటి న్యూ క్యాంపస్‌లోని బాయ్స్ హాస్టల్‌-2లోకి గురువారం పెద్ద కొండచిలువ వెళ్లి మంచం కింద చుట్టుకొంది. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు గదిలోకి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే శబ్ధం రావడంతో.. మంచం కిందకు చూశారు. కొండ చిలువ ఉండడంతో కేకలు వేశారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకుని విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సెక్యూరిటీ అధికారి కొండచిలువ ఉన్న విషయాన్ని ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ బాలసుబ్రమణ్యంకు సమాచారమిచ్చారు. డిప్యూటీ రేంజ్‌ అధికారి గురప్ప, మధు, ఎస్‌బిఒ శివమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫారెస్ట్‌ సిబ్బంది కొండ చిలువను చాకచక్యంగా గోనెసంచిలో బంధించి సమీప అడవుల్లో విడిచిపెట్టారు. దీంతో, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ పాత ట్రిపుల్‌ఐటి క్యాంపస్‌ భవనాల్లో పాములు వస్తుండడంతో విద్యార్థులు ఆందోళన చేసిన సంఘటనలు ఉన్నాయి. హాస్టల్‌ గదులకు కిటికీలు సరిగా లేకపోవడంతోనే కొండచిలువ వచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. విషపురుగులు రాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

➡️