సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె మరింత ఉధృతం

Dec 26,2023 09:57 #Anganwadi strike, #press meet, #request
  • రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వినతులు – అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్లు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్లు ప్రకటించాయి. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి బేబిరాణి, కె సుబ్బరావమ్మ, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జె లలితమ్మ, ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు ఇ పద్మ విజయవాడలోని బాలోత్సవ భవనంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. అంగన్‌వాడీల సమ్మె 14 రోజులకు చేరిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాల పెంపు, గ్రాట్యూటీ అమలు తదితర విషయాల్లో ప్రభుత్వం నోరు మెదపలేదని పేర్కొన్నారు. గతంలో జరిగిన చర్చల్లో మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మారుస్తామని అంగీకరించారని, ఇప్పటి వరకు దీనికి సంబంధించిన జిఓ ఇవ్వలేదన్నారు. సమస్యలను పరిష్కరించకుండా సచివాలయ ఉద్యోగులతో కేంద్రాల తాళాలు పగలగొట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ టార్చర్‌ భరించలేక తూర్పుగోదావరి జిల్లాలో వర్కర్‌ ఆస్పత్రి పాలయ్యారని తెలిపారు. మృతిచెందిన కుటుంబాలకు మట్టి ఖర్చులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ 560 పోస్టులు ఇచ్చామని మంత్రి ఉషశ్రీ చరణ్‌ అబద్ధాలు ఆడుతున్నారని అన్నారు. తమ సమ్మెకు లబ్ధిదారుల నుంచి అపూర్వ మద్దతు లభిస్తుందని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలను తెరవాలని ప్రభుత్వం నాలుగు శాఖలతో తలకిందులుగా తపస్సు చేసిందన్నారు. ఇప్పటి వరకు ఒక్క పిల్లాడికి కూడా సరైన తిండి పెట్టలేకపోతుందన్నారు. ప్రభుత్వం అద్దెలు ఇవ్వకపోయినా గర్భిణులు, బాలింతలకు పోషణ అందించామన్నారు. లబ్ధిదారులకు ఇచ్చే ఆహారం నాసిరకంగా ఉందని, నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్‌ చేశారు. గ్రాట్యూటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్‌ కేంద్రాలుగా మార్చాలని కోరారు. అన్ని డిమాండ్లనూ పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం కుటుంబ సభ్యులతో ఖాళీ కంచాలు, గరిటలు మోగిస్తామని తెలిపారు. 27న ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రుల ఇళ్లు, క్యాంపు కార్యాలయాలకు సామూహిక వినతిపత్రాలు అందిస్తామని, 28న ముఖ్యమంత్రికి పోస్టు కార్డు ఉద్యమం చేపడతామన్నారు. 29న రిలే దీక్షలు చేపడతామని తెలిపారు. ప్రజా సంఘాలు, లబ్ధిదారుల సహకారంతో 30న గ్రామ, వార్డు, సచివాలయాల వద్ద ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. 31న ఆట పాట నిర్వహిస్తామన్నారు. అప్పటికీ సమస్యలు పరిష్కరించకపోతే జనవరి 1 నుంచి పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. తమ ఆందోళనలకు రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాలు, లౌకిక ప్రజాతంత్ర వాదులు, ప్రజలు విశాల మద్దతు ఇవ్వాలని కోరారు.

➡️